జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నోటిఫికేషన్ 13 అక్టోబర్ న అంటే వచ్చే సోమవారం విడుదల చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 20-10-2025 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ పదకొండో తేదీన పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజున విజేతను ప్రకటిస్తారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమయింది. బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా మాగంటి సునీతను ఖరారు చేశారు. కాంగ్రెస్ , బీజేపీ తరపున ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. అభ్యర్థి విషయంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లి .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. గతంలో మజ్లిస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనతో పాటు మరికొంత మంది పేర్లను పరిశీలిస్తున్నారు.
బీజేపీ తరపున ఎవర్ని నిలబెడతారన్నది స్పష్టత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ ఊపఎన్నిక కీలకంగా మారనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఉనికి కష్టమవుతుందని బీఆర్ఎస్.. తాము ఓడితే ప్రభుత్వ వ్యతిరేకత నిజమవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నాయి. అందుకే విజయం కోసం శక్తి వంచన లేకుండా పోరాడనున్నాయి.