బీహార్ లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్ల జాబితాలోని లోపాలను చూపించి ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం.. పోల్ బాడీ మీద ప్రజల్లో నమ్మకం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నింటికీ చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది . బీహార్ లో చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో .. తీసేసిన ఓట్లను ఎందుకు తీసేశారో కారణం కూడా స్పష్టంగా చెప్పారు. ఆ తరహాలో ఇప్పుడు .. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దాలని నిర్ణయించారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2025లో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన పెద్ద కసరత్తు. గత 20 సంవత్సరాల్లో పట్టణీకరణ, కార్మికుల వలసల వల్ల వచ్చిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడానికి; కేవలం పౌరులు మాత్రమే జాబితాలో ఉండాలన్న లక్ష్యంగా చేపట్టారు. మొత్తం 8 కోట్ల ఓటర్లకు ఫారమ్‌లు పంపిణీ చేశారు. 2003 జనవరి 1 నాటి ఓటర్లకు అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు. 2003 తర్వాత రిజిస్టర్ అయిన 3 కోట్ల మంది ధృవీకరణ చూపించాల్సి ఉంటుంది. దేశమంతటా ఇవే రూల్స్ అమలు చేసే అవకాశం ఉంది.
ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ప్రయత్నించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. గత వైసీపీ హయాంలో అధికారుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి ఏపీలో జరిగాయి. ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. SIR ప్రక్రియతో అన్ని లోపాలను తొలగించే అవకాశం ఉంది.