రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ ధర్నాతో కాంగ్రెస్ పార్టీ ఓ స్పష్టత ఇచ్చినట్లయింది. బీజేపీ, మోదీ అడ్డుకుంటున్నారని రేవంత్ తేల్చేశారు. తమ పోరాటం కొనసాగుతుందని.. ప్రధాని మోదీని దించి రాహుల్ ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే ఇప్పటికి అధికారికంగా బీసీ రిజర్వేషన్లపై చేతులెత్తేసినట్లే అనుకోవచ్చు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్న సవాల్.. స్థానిక ఎన్నికలు. కోర్టు ఆదేశాల ప్రకారం మరో రెండు నెలల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. వచ్చే నెలాఖరు కల్లా సర్పంచ్, పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలి. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో అధికారికంగా పెంచడం సాధ్యం కాదని రేవంత్ కూడా చెప్పినట్లయింది కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టిందో అదో పద్దతిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
రాజకీయ విమర్శలు వస్తాయి కానీ.. రేవంత్ వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధాలను ఢిల్లీ ధర్నాతో సమకూర్చుకున్నారు. రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలను ఇంకా ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. రాజకీయంగానూ స్థానిక ఎన్నికలు ఆలస్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయం కాంగ్రెస్ లో ఉంది. అందుకే.. పాత రిజర్వేషన్లతోనే నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అనుకోవచ్చు.