ఏలూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు, ఆ పేరుతో సాగిన వసూళ్ల పర్వం చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, చిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఈ వేడుకలను నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 30 వేల మందికి భారీ స్థాయిలో విందు భోజనాలు ఏర్పాటు చేయడం, వివిధ పోటీలు నిర్వహించారు.
రెవెన్యూ, ఉపాధి హామీ, డ్వాక్రా వంటి శాఖల సిబ్బందికి ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు టార్గెట్లు విధించినట్లు సమాచారం. ఈ మొత్తం ఇవ్వని పక్షంలో బదిలీ వేటు వేస్తామని లేదా విధుల్లో ఇబ్బందులు సృష్టిస్తామని ఎమ్మెల్యే అనుచర వర్గం నుంచి బెదిరింపులు వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఇదే విధంగా వసూళ్లకు పాల్పడటం, దానిపై పార్టీ అధిష్టానం వద్ద ఆడియో రికార్డింగులతో సహా ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు.
ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత వేడుకలను సొంత ఖర్చులతో లేదా అభిమానుల స్వచ్ఛంద సహకారంతో జరుపుకోవడం ఆనవాయితీ. కానీ, అధికార బలాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం మంచిది కాదు. పండుగ పూట తమ జేబులకు చిల్లు పడటంతో అటు కాంట్రాక్టర్లు, ఇటు సామాన్య ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ప్రభుత్వ బాధ్యత.
