అమెరికా కలల నుంచి, భ్రమల నుంచి భారతీయ తల్లిదండ్రులు బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారి కళ్లను డొనాల్డ్ ట్రంప్ తెరిపించారు. ఎంతగా అంటే ఈ ఏడాది అమెరికా వెళ్లి అక్కడి యూనివర్శిటీల్లో చేరి చదువుకోవాలనుకునేవారిలో సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. దీని వల్ల భారతీయ తల్లిదండ్రులకు యాభై వేల కోట్ల రూపాయల వరకూ ఆదా అవుతుంది. అంత మేర అమెరికాకు నష్టం జరుగుతుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా యూనివర్శిటీలు ఉనికి సమస్యలో పడనున్నాయి.
లక్షా 40 వేల వీసా స్లాట్లు
భారతీయ విద్యార్థుల కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది. ఈ సారి కూడా భారీగా లక్షా నలభై వేలకుపైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో అయితే ఈ స్లాట్లు ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయేవి.కానీ ఈ సారి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అమెరికన్ కాన్సులేట్ ఖాళీగా ఉన్నాయని మీడియాకు సమాచారం ఇస్తోంది. ప్రచారం చేయాలని కోరుతోంది.
ట్రంప్ కఠిన చర్యలతో విద్యార్థుల వెనుకడుగు
అమెరికా వెళ్లి చదువుకుంటే అక్కడే ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటారు. అయితే ట్రంప్ మాత్రం అందర్నీ వెళ్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. ఓపీటీని కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం సాధ్యం కావడం లేదు. పెద్ద ఎత్తున ఖర్చులు ఉంటాయి. ఈ క్రమంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను అమెరికా పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. డబ్బులకు కొదవలేదు.. అనుకున్నవారు మాత్రం పంపే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ట్రంప్ ఓపీటీ రద్దు చేస్తే.. చదువు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేయాలి కానీ.. అమెరికాలో ఉద్యోగం చేయలేరు.
అమెరికా స్వర్గం కాదు.. ఇక్కడే ఎన్నో అవకాశాలు
అమెరికా ఇప్పుడు అవకాశాల స్వర్గం కాదు. అక్కడ కూడా పరిస్థితి మారుతోంది. రాబోయే రోజుల్లో అమెరికాలో జీవన ప్రమాణాలు మరింతగా తగ్గుతాయి. మన దేశంలోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలన్నీ ఇక్కడే భారీ నియామకాలు చేపట్టి కార్యాలయాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో చదువు కోసం కోటి వరకూ ఖర్చు పెట్టడం కన్నా.. ఇక్కడే అంత కంటే తక్కువ ఖర్చుతో మంచి విశ్వవిద్యాలయంలో చేరి క్యాంపస్ లోనే ఆఫర్ పొందవచ్చు. ఈ విషయంలో విద్యార్థులు , వారి తల్లిదండ్రులు.. తెలివైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు.