కచ్చితంగా గెలుస్తుందనుకున్న లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత ఆటగాళ్లు తడబడ్డారు. 176 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. రవీంద్ర జడేజా ఒక్కడే 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో మొదటి మూడు రోజులు ఏ జట్టు కూడా ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. ఇండియా, ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లు లెవెల్ అయ్యాయి. దీంతో చివరి రెండు రోజులు ఆట మాత్రమే మిగిలింది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. ఇంగ్లాండ్ జట్టును 192 పరుగులకు ఆలౌట్ చేశారు. 193 పరుగుల టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు నాలుగో రోజే షాక్ తగిలింది. 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ఐదో రోజు ఆటలో అద్భుతం జరుగుతుందని అందరూ ఆశించారు. రాహుల్ క్రీజులో ఉన్నాడు. ఐదో రోజుకు పంత్, సుందర్, జడేజా, నితీష్ నలుగురు బ్యాట్స్‌మెన్ మిగిలారు. టార్గెట్‌ను భారత్ చేధిస్తుందని అందరూ భావించారు.కాని ఐదో రోజు ఆట ప్రారంభంలో భారత్ ఒత్తిడికి లోనైంది. తొలి గంటలోనే మూడు వికెట్లను పారేసుకుంది. పంత్, రాహుల్, సుందర్ కొద్ది వ్యవధిలోనే అవుట్ అయ్యారు. దీంతో భారమంతా జడేజాపై పడింది.
జడేజా, నితీష్ రెడ్డి చాలాసేపు ప్రతిఘటించారు. ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే చెమటోడ్చిన ఇంగ్లాండ్ బౌలర్లు నితీష్‌ని అవుట్ చేసి మళ్లీ గెలుపు దిశగా అడుగులు వేశారు. కానీ ఈ క్షణంలో టీమిండియా బౌలర్ల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. క్రీజులోకి వచ్చిన బుమ్రా దాదాపు గంట 40 నిమిషాల పాటు ఆడాడు. నిజంగా చాలా మెమోరబుల్ ఇన్నింగ్స్ ఇది. అతను చేసిన పరుగులు నాలుగే కావచ్చు కానీ 54 బంతులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన సిరాజ్ దాదాపు 30 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరూ కూడా జడేజాకు తోడయ్యారు. దీంతో ఆట చివరి వరకు ఆసక్తికరంగానే కొనసాగింది.
మరో 22 పరుగులు చేస్తే భారత్ లార్డ్స్‌లో చరిత్ర రాసేది. కానీ సిరాజ్ డిఫెన్స్ చేసిన బంతి నేలకు తాకి అనూహ్యంగా స్టంప్స్‌కు తాకింది. దీంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది.
అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఓటమి టీమ్ ఇండియాకు, ఫ్యాన్స్‌కు చాలాకాలం గుర్తుండిపోతుంది. భారత్ ఇన్నింగ్స్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. ఐదో రోజు ఆరంభంలో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. బుమ్రా గంట 40 నిమిషాలు క్రీజులో ఉన్నప్పుడు రాహుల్, పంత్, సుందర్ లాంటి బ్యాట్స్‌మెన్ ఎందుకు త్వరగా వికెట్లు పారేసుకున్నారో ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి.
టెస్ట్ మ్యాచ్ అంటే వికెట్ల దగ్గర పాతుకుపోవడమే కాదు, అవసరమైనప్పుడు బంతిని బౌండరీకి దాటించాలి. అవకాశం ఉన్నప్పుడే స్కోర్ బోర్డ్‌ను ముందుకు నడపాలి. జడేజా, నితీష్ రెడ్డి పార్టనర్‌షిప్‌లో ఈ లోపం కనిపించింది. ఇద్దరూ చాలా సేపు నిలబడ్డారు. కానీ స్కోర్ బోర్డ్ ముందుకు కదలలేదు. వాళ్లిద్దరిలో ఒక్కరు ఛాన్స్ తీసుకుని స్కోర్‌ను కరిగించాల్సింది. కానీ అది జరగలేదు. ఆ పార్టనర్షిప్ విజయానికి బాటలు వేయలేకపోయింది.
వికెట్లన్నీ పడ్డాక జడేజాపై మొత్తం భారం పడిపోయింది. నాలుగో బంతికి సింగిల్ తీసి మరో ఓవర్ ఆడే బాధ్యత తను తీసుకోవడం చేశాడు. అవసరమైనప్పుడు ఫోర్లు కొట్టాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
అయితే ఇండియా ఈజీగా ఓడిపోలేదు. గెలుపు కోసం ఇంగ్లాండ్ చెమటలు చిందించింది. స్కోర్ ఇరవై బ్రాకెట్లోకి వచ్చాక వాళ్లలోనూ టెన్షన్ మొదలైంది. అయితే అదృష్టం ఇంగ్లాండ్ వైపే ఉంది. సిరాజ్ వికెట్ బ్యాడ్‌లక్. ఈ విజయంతో సిరీస్ 2-1 ఆధిక్యంలోకి వచ్చింది ఇంగ్లాండ్. నాలుగో టెస్ట్ జులై 23న ప్రారంభం అవుతుంది.