బేబీతో సినిమా సెన్సేషనల్ జోడిగా పాపులరైన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కలిసి మరో సినిమా చేస్తున్నారు. ‘#90s వెబ్ సిరిస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా ఎపిక్ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ గ్లింప్స్ గమ్మత్తుగా వుంది. ఆదిత్య కొత్తగా అలోచించాడు. #90s వెబ్ సిరిస్ లో చిన్నకొడుకు పాత్రతో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. అది స్క్రీన్ మీద చాలా ఆసక్తికరంగా వుంది.
మాస్టర్స్ పూర్తి చేసుకున్న హీరోయిన్ తను పెళ్లి చేసుకుబోయే వ్యక్తి గుణగణాలకు గురించి ఓ చిట్టా చెబుతుంది. దానికి పూర్తి విరుద్ధంగా ఎంట్రీ ఇస్తాడు హీరో. ‘ఇది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ కి భలే హిట్ అయ్యింది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమా, పాత్రలపై ఆసక్తిని పెంచేశారు. సితార నాగవంశీ సినిమాని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్.