ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఏడ్చారు. ఈ రాజకీయాలు చేయాలా వద్దా అని కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఏడుపు చూసి చాలా మంది జాలిపడ్డారు. కొంత మంది పాపం అనుకున్నారు… కానీ ఆయన చేసిన రాజకీయాలను గుర్తు చేసుకున్నవారు మాత్రం తడవకుండా.. కనీసం బాల్క సుమన్ చేసినట్లుగా అయినా రాజకీయం చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆయన గత చరిత్ర అంత ఘనంగా ఉంది మరి.
రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ కంటే మాస్ లీడర్ దయన్న. వరంగల్ జిల్లాలో టీడీపీ తరపున కనిపించే ఏకైక విగ్రహం ఆయనదే. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన ఇమేజ్ ఎలా ఉండేదంటే.. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించి ఉపఎన్నికలతో సెంటిమెంట్ ను ఆకాశానికి తీసుకెళ్లిన సమయంలో.. కాంగ్రెస్తో చాలెంజ్ చేసి ఉపఎన్నికలు తెస్తే.. టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన ఎంపీగా గెలిచారు. అసలు పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉందని అనుకున్నారు. కానీ దయన్న గెలిచి చూపించారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయన హవా తగ్గలేదు. 2014లో వరంగల్ జిల్లాలో ఉద్యమం ఎలా ఉండేదో అందరికీ తెలుసు. టీడీపీపై ఆంధ్రా పార్టీ ముద్ర వేసినా సరే దయాకర్ రావుతో పాటు ధర్మారెడ్డిని గెలిపించుకున్నారు. అలాంటి ఇమేజ్ ఆయన సొంతం. కానీ ఇప్పుడు ఆయన కన్నీరు పెట్టుకుంటున్నారు. ఓ ఇరవై ఆరేళ్ల ..రాజకీయం తెలియని యువ నేత చేతిలో పరాజయం పాలవడమే కాకుండా.. కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎర్రబెల్లి జీవితంలో తొలి సారి ఓడిపోయారు. ఆయన చరిత్రతో పోలిస్తే అదేమి పెద్ద ఓటమి కాదు. మళ్లీ గెలవగలరు..కానీ ఇలా.. మున్సిపాలిటీని గెలిపించినా.. ఓడిపోయి ఏడవడం మరీ చిన్నతనంగా ఉంది.
ఆయన రాజకీయం అంతా ఏమైపోయిందో అని .. ఆయనను మొదటి నుంచి చూసిన వాళ్లు ఫీలవుతున్నారు.
రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఎర్రబెల్లి ఫీలవుతున్నారు. ఇదే తరహా ఏడుపులతో రాజకీయం చేయాలనుకుంటే ఆయన రిటైరవడమే మంచిదన్నది చాలా మంది అభిప్రాయం. ఇలా ఏడ్చి ప్రజల సానుభూతి పొందుదామని వ్యూహం అయితే మాత్రం ఇంకా అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఆయన దగ్గర రాజకీయం అంతా అయిపోయినట్లే.
