చైనా కంపెనీ బీవైడీ ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించుకుంటూ ఉండటంతో ఇండియా మార్కెట్ పై ఎన్నో ఆశలతో టెస్లాను లాంచ్ చేసిన ఎలాన్ మస్క్‌కు నీరసమే ఎదురొస్తోంది. ఈ ఏడాది కనీసం రెండున్నర వేల కార్లు దిగుమతి చేసి అమ్మాలని అనుకున్నారు. కానీ బుకింగులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆరు వందల కార్లకు మాత్రమే బుకింగులు జరిగాయి. అది కూడా కొత్త మోజులో వచ్చిన బుకింగులే. రాను రాను ఎంక్వయిరీలు కూడా తగ్గిపోయినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
టెస్లా ముంబై, ఢిల్లీల్లో రెండు ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించింది. చార్జింగ్ స్టేషన్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. అయితే ధర చాలా ఎక్కువ కారణంగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అమెరికాలో 30 లక్షల రూపాయలకు వచ్చే కారు ఇండియాలో అరవై లక్షలు దాటిపోతోంది. అందుకే చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. దిగుమతి సుంకాలు ఎక్కువ కావడమే దీనికి కారణం. ప్రస్తుతం బుకింగులు చేసుకున్న వారికి ఈ నెల నుంచే డెలవరీలు ఇవ్వనున్నారు. చైనా నుంచి వాటిని దిగుమతి చేస్తున్నారు.
ఇండియాలో ఉండే డిమాండ్ ను బట్టి ప్లాంట్ పెట్టాలని మస్క్ అనుకుంటున్నారు. కానీ పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదు. అయితే ఇండియాలో ఉత్పత్తి చేస్తే..కార్లను 30లక్షలకే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. ఎక్కువ అమ్మకాలు ఉంటాయి. మరి మస్క్ ఇలా ఆలోచిస్తారా లేకపోతే ఇండియా మార్కెట్ పై ఆశలు వదిలేసుకుంటారా?. బీవైడీ ఇండియాలో ప్లాంట్ పెట్టి తక్కువకే టెస్లా కన్నా మంచి ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించడానికి సిద్ధపడినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు.