ఈటల రాజేందర్ కు ప్రశాంత లేదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తానే లీడర్ అని..తన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో నిలబెడతానని తాజా ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల జీవో కొట్టివేతపై స్పందించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసే వారిని తానే ఎంపిక చేస్తానని ప్రకటించారు. తానే బీఫాంలు ఇస్తానని.. స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గానికి తానే లీడర్నని ఆయన చెబుతున్నారు.
నిజానికి ఇప్పుడు ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీ . సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఓడిపోవడంతో ఆయన మల్కాజిగిరి ఎంపీగా టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు. అప్పట్నుంచి హుజూరాబాద్ లో బండి సంజయ్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. హుజూరాబాద్‌తో ఈటలకు సంబంధం లేదని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. తనను నమ్ముకుని తనతో పాటు వచ్చిన క్యాడర్ మేలు చేయాలని.వారికి పార్టీ తరపున టిక్కెట్లు ఇప్పించాలని ఈటల అనుకుంటున్నారు. కానీ పరిస్థితి చేయి దాటుతూండటంతో నేరుగా ప్రెస్ మీట్ లో అసహనం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచినప్పటికీ తన అడ్డాగా ఈటల రాజేందర్ .. హుజూరాబాద్ నే నమ్ముతున్నారు. ఈ సారి అసెంబ్లీకి పోటీ చేసేది హుజురాబాద్ నుంచేనని అంటున్నారు. కానీ ఆయనకు బీజేపీలో ప్రస్తుతం అంత తేలికైనా పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచడాన్ని ఆయన భరించలేకపోతున్నారు. తన అనుచరుల్ని కాపాడుకునేందుకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.