జగన్‌ ప్లానింగ్‌లో ఉండగానే.. అంతా అయిపోయింది

Jagan Mohan Reddy

విశాఖలో రైల్వేజోన్‌ సాధించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్ష ఒక కొలిక్కి వచ్చేసింది. మూమూలుగా ఇలాంటి ఆమరణ దీక్షలను అయిదో రోజు వరకు అనుమతించి, బలవంతంగా ఆస్పత్రికి తరలించే అలవాటు ఉన్న పోలీసులు నాలుగోరోజునే స్పందించారు. గుడివాడ అమర్నాధ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేశారు. రోజా దీక్షకు మద్దతుగా విశాఖ కార్యకమ్రంలో పాల్గొని.. అక్కడ ప్రసంగంలో తెలుగుదేశం నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేసిన రోజు రాత్రే.. దీక్ష భగ్నం కావడం విశేషం.
అయితే రైల్వేజోన్‌ వ్యవహారం యావత్‌ రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా ప్రొజెక్ట్‌ చేసి.. మైలేజీ సాధించాలనుకున్న వైకాపా ప్రయత్నానికి కొంత గండి పడినట్లే లెక్క. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి.. దీక్ష భగ్నం కావడం సోమవారం సాయంత్రం జరుగుతుందనే అంచనాతోనే వారు ఉన్నారు. సోమవారం గనుక… వైఎస్‌ జగన్‌ స్వయంగా దీక్షలో పాల్గొనడానికి వస్తే.. పార్టీకి చాలా మైలేజీ వస్తుందనుకున్నారు. ఇప్పుడు ఆ చాన్స్‌ మిస్సయింది.
గుడివాడ అమర్నాధ్‌ దీక్షను గాలికి వదిలేసినట్లు అయిందని, దీనివల్ల జోన్‌ వచ్చే సంగతి పక్కన పెడితే.. కనీసం జగన్‌ ఒకరోజైనా పాల్గొని ఉన్నట్లయితే పార్టీకి రాగల మైలేజీ కూడా దక్కకుండా పోయిందని అంతా ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు వైకాపా ప్రారబ్ధం ఏంటంటే.. ”అమర్నాధ్‌ చేసిన దీక్షకు వారి సొంత పార్టీ నాయకుడినుంచే సరైన మద్దతు లేదు. ఆ విశాఖ రైల్వేజోన్‌ వ్యవహారంపై వైకాపాకు చిత్తశుద్ధి లేదు. వారి పార్టీ నాయకుడు కూడా కనీసం దీక్షకు మద్దతుగా కూర్చోవడం జరగలేదు.” అని తెదేపా విమర్శించడానికి తామే అస్త్రాలు అందించినట్లుగా పరిస్థితి తయారైందని విశాఖ వైకాపా నాయకులు వాపోతున్నారు. జగన్‌ ఈ నాలుగురోజుల్లో ఒకసారైన విశాఖకు వచ్చి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com