తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి, సిట్ విచారణకు సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. నెయ్యి విషయంలో భోలేబాబా, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకరించారు. CFTRI రిపోర్టు ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని తెలుసునని వైవీ సుబ్బారెడ్డికి కూడా తెలిసినట్లు ధర్మారెడ్డి చెప్పారని అంటున్నారు. అయితే హైకమాండ్ ఒత్తిడితో నెయ్యి సరఫరాను కొనసాగించక తప్పలేదని.. బాధ్యతగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజం అయితే లడ్డూ కల్తీ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రానున్నాయి. ఎందుకంటే ధర్మారెడ్డికి మొత్తం తెలుసు. తెలియకుండా ఉండే అవకాశాలు లేవు. అయితే చాలా మంది ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలు లేవని.. ఆయన జగన్ రెడ్డికి కరుడుగట్టిన అభిమాని అని అనుకుంటున్నారు. కానీ టీటీడీ ఈవోగా ఉన్న కాలంలో ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలో.. మరో కారణమో కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన చాలా కోల్పోయారు.
అదే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై చాలా కేసులు ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి విచారణ జరగలేదు. ఆయనకూడా సైలెంట్ గా ఇంటికెళ్లిపోయి రెస్టు తీసుకుంటున్నారు. ఎప్పుడూ బయటకు కూడా రాలేదు. దానికి కారణం వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చిన ఓ కీలక ఎంపీతో ఉన్న బంధుత్వమే కారణం అని భావిస్తున్నారు. ఆయన చొరవతోనే ఇప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని దేవుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. థర్మారెడ్డి నిజంగా ధర్మం వైపు నిలబడితే దేవుడ్నే మోసం చేసిన వారి అరాచకాలు అన్నీ బయటకు వస్తాయి.


