లక్ష్యం… 8 లక్షలు. గడువు… 15 రోజులు. ఆ గడువు సగానికిపైగా అయిపోయింది! కానీ, లక్ష్యంలో సగం కూడా సాధించలేకపోయారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు! తెలంగాణ తెలుగుదేశం నేతలకు నిద్రలేకుండా చేస్తోంది సభ్యత్వ నమోదు కార్యక్రమం. నిజానికి, గడచిన నెలలోనే సభ్యత్వ నమోదుకు గడువు ముగిసినా… ఆశించిన స్థాయిలో సభ్యులను చేర్చడంలో టి.నేతలు ఘోరంగా విఫలమయ్యారంటూ అధిష్టానం అందరికీ టోకున అక్షింతలు వేసింది. దీంతో దిద్దుబాటు చర్యలకు మరో 15 రోజులు గడువు ఇచ్చి, సభ్యత్వ నమోదు కనీసం 8 లక్షల ఫిగర్ దాటాలంటూ నేతల మెడలపై అధినాయకత్వం కత్తి పెట్టింది. గోరిచుట్టుపై రోకటి పోటు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎందుకంటే, ఇప్పటికే టీడీపీ నేతల మధ్య సమన్వయ లోపం, క్యాడర్లో తగ్గిన భరోసా, పార్టీలో భవిష్యత్తుపై కొంతమంది నాయకులకు నమ్మకం తగ్గిన వైనం.. ఇన్ని సమస్యలు ఉండగా ఈ సభ్యత్వ నమోదు నాయకులకు పరీక్షగా మారింది.
నిజానికి, ఇంతవరకూ తెలంగాణలో 28 నియోజక వర్గాలకు పార్టీ తరఫున ఇన్ఛార్జ్లు లేరు. కొన్ని చోట్ల ఐదుగురు, ముగ్గురు చొప్పున కమిటీలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఉంటే సభ్యత్వ నమోదు విషయంలో చురుకైన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ప్రశ్న. ఇక, కొంతమంది నాయకుల తీరు ఇంకో రకంగా ఉంటోందట! వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు ఇస్తామన్న భరోసా అధినాయకత్వం ఇస్తేనే… సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటామంటూ కొంతమంది గొంతెమ్మ కోరికలు కోరుతున్నారట! గతంలో భాగ్యనగరంలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది కత్తిమీద సాములా మారింది. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజక వర్గాల్లో దేశానికి మాంచి పట్టు ఉండేది. అయితే, ఇలాంటి ప్రాంతాల్లో కూడా సభ్యత్వ నమోదు చేయించే దిక్కు లేకుండా పోయింది.
శేర్లింగంపల్లిలో గతసారి దాదాపు 20 వేల మంది సభ్యులు చేరారు. అయితే, ఇప్పుడా సంఖ్య 2 వేలు దాటడం లేదట! ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజక వర్గంలో గతంలో 18 వేల వరకూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటే.. ఇప్పుడా సంఖ్య 2 దగ్గరే ఉంది. అంటే ఇద్దరు మాత్రమే తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారన్నమాట. ఇక, తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ఏదేమైనా, గడువు దగ్గర పడుతూ ఉండటంతో దేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో పొడిగించుకున్న గడువు కూడా పూర్తి కాబోతోంది. కనీసం 8 లక్షల సభ్యత్వాలు చేర్పించాలని అధిష్టానం సూచించింది. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఓ మూడు లక్షలకు చేరితేనే గొప్ప అన్నట్టుగా ఉంది. దీంతో తెలుగుదేశం నేతలందరూ తలలుపట్టుకుంటున్నట్టు సమాచారం!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని చంద్రబాబు ఈ మధ్యనే రాష్ట్ర నేతలను ఉద్దేశించి చెప్పారు. సరైన నాయకత్వం ఉంటే రాష్ట్రంలో పార్టీ దూసుకుపోతుందని అన్నారు. నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు ఏంటో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమమే అద్దం పట్టేలా ఉంది!