హైదరాబాద్లో జరిగిన తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న ఆనందంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించాలని ఆయన కోరారు. అయితే, ఆ విజ్ఞప్తి చేసే క్రమంలో ఆయన వాడిన పక్క రాష్ట్రం , మరో తెలుగు రాష్ట్రం అనే పదాలను పట్టుకుని కొంతమంది విమర్శలకు దిగుతున్నారు. చిరంజీవి పూర్తి ప్రసంగాన్ని వింటే ఆయన ఉద్దేశం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది.
ఆగిపోయిన పురస్కారాలపై ఆవేదన మాత్రమే
నిజానికి చిరంజీవి చెప్పిన మాటల్లో ఎక్కడా ఏపీపై చులకన భావం లేదు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవిస్తున్న తీరును ఆయన అభినందించారు. అదే స్ఫూర్తితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను మళ్ళీ ప్రారంభించాలని కోరారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనేది ఆయన నమ్మకం. ఏపీలో గత కొన్నేళ్లుగా నంది అవార్డులు నిలిచిపోవడం వల్ల సినీ పరిశ్రమలోని ఎంతో మంది ప్రతిభావంతులు గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఆ వెలితిని పూరించాలనేది మెగాస్టార్ నిజమైన ఆకాంక్ష.
ఏపీ కూడా అన్న భావమే!
చిరంజీవి ని విమర్శించే వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శక్తివంతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీకి చెందిన వారే. ఫిబ్రవరి 2026లోనే మంత్రి దుర్గేష్ త్వరలోనే నంది అవార్డులకు జ్యూరీని ఏర్పాటు చేస్తామని, కొత్త ఫిల్మ్ పాలసీని తెస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలిసినా లేకపోయినా, తన తమ్ముడు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని చిరంజీవి ఎందుకు అనుకుంటారు? పక్క రాష్ట్రం అనడం అనేది భౌగోళికంగా తెలంగాణ వేదికపై నుండి చేసిన ప్రసంగంలో వచ్చిన పదం మాత్రమే తప్ప, అది పరాయి రాష్ట్రం అనే అర్థంలో అన్నది కాదు అనుకోవచ్చు.
విమర్శించడానికి కారణాలు వెదుక్కోవాలా?
గతంలో కూడా చిరంజీవి తన భావ వ్యక్తీకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన మనసులో ఒకటి ఉంటే, అది బయటకు వచ్చేటప్పుడు పదాల ఎంపికలో జరిగే చిన్న తేడాల వల్ల విమర్శలు రావడం కొత్తేమీ కాదు. ఒకే భాష మాట్లాడే రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, రెండు చోట్లా కళాకారులకు మేలు జరగాలని కోరుకోవడంలో తప్పేముంది? ఏపీలో షూటింగ్లు జరగడం లేదని, కేవలం టికెట్ రేట్ల కోసమే వస్తారని ఆయనపై విమర్శలు చేసేవారు.. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను, సినీ కార్మికుల పట్ల ఆయనకున్న ప్రేమను మర్చిపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ కులాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వారు. ఒక వేడుకలో తన సహజ శైలిలో చేసిన విజ్ఞప్తిని భూతద్దంలో చూపిస్తూ, విమర్శలకు దిగడం సమంజసం కాదు. విమర్శించే వారు ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే, ఆయన కోరుకున్నది కళాకారుల గౌరవమే తప్ప మరేమీ కాదని అర్థమవుతుంది. సమస్య పదాల ఎంపికలో సమస్యే తప్ప.. ఆయన భావనలో కాదు. మెగాస్టార్ ను విమర్శించడానికి ఇది ఓ కారణం కాదు.


