యాభై లక్షలకే ఇల్లు, అపార్టుమెంట్ అంటే.. మన కు ఆ స్థోమత ఉంది కదా అని చాలా మంది రెడీ అయిపోతారు. తీరా అందులోకి దిగిన తర్వాత అదనపు ఖర్చుల కోసం మరిన్ని ఎక్కువ అప్పులు చేసి ఇంటి కొనుగోలును తమ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా భావిస్తారు. అలా కాకుండా.. ఇల్లు కొనుగోలుతో పాటు దాని చుట్టూ ఉండే ఖర్చులపై కూడా అవగాహన పెంచుకుంటే.. చాలా వరకూ ధరపై స్పష్టత ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల గురించి అందరికీ అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇది లక్షలకు చేరింది. యాభై లక్షలు పెట్టి ఆస్తి కొంటే.. నాలుగైదు లక్షల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బిల్డర్లు జీఎస్టీ వసూలు చేస్తూంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకే జీఎస్టీ. పూర్తి అయిన ఇళ్లకు ఉండదు.
అలాగే ఆస్తి పత్రాల వెరిఫికేషన్ కోసం న్యాయవాది రుసుము, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా ఇల్లు కొంటే, బ్రోకర్లు ఫీజు, హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, ఇంటీరియర్ ఖర్చులు, విద్యుత్, నీటి సరఫరా, లేదా ఇతర సేవల పేరు మార్పు కోసం రుసుము. అపార్ట్మెంట్లలో పార్కింగ్ స్థలం కోసం అదనపు ధర కూడా ఇందులో ఉంటాయి. పార్కింగ్, ఇంటీరియర్ ఖర్చులు లక్షల్లోనే ఉంటాయి. అందుకే .. ఇలాంటి ఖర్చుల కోసం కనీసం పది శాతం ఎక్కువగా నిధుల్ని సమీకరించుకోవాలి. యాభై లక్షలతో ఇల్లు కొనాలనుకుంటే..కనీసం అరవై లక్షల నిధుల్ని సమీకరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.