ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన చిత్రం ‘ఎఫ్ 2’. వంద కోట్ల మైలు రాయిని అందుకుని దిల్‌రాజు చిత్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం మిగిలిన భాషల్లోనూ వెళ్తోంది. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దిల్‌రాజు ధృవీకరించారు కూడా. ”ముంబైలో రోజుకి కనీసం ఇద్దరు హీరోలు ఈ సినిమా చూస్తున్నారు. హీరోలెవరు? అనే విషయాన్ని బట్టి దర్శకుడు, తదితర వివరాలు బయటకు వస్తాయి. ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వీలుంటే హిందీలో ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తా. కాకపోతే… సొంతంగా నిర్మించడం కంటే నిర్మాణ భాగస్వామిగా ఉండడమే నయం. ఎందుకంటే.. తెలుగులో ఈ యేడాది చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి” అని క్లారిటీ ఇచ్చారు దిల్‌రాజు. ఎఫ్ 3 ఎప్పుడు అని అడిగితే.. ”2021 సంక్రాంతికి ఎఫ్ 3 తీసుకొస్తాం. ఓ లైన్ గా అయితే అనిల్ రావిపూడి ఈ కథ చెప్పాడు. పూర్తి స్థాయిలో కథ సిద్ధం అవ్వలేదు. స్క్రిప్టు పూర్తయ్యాకే ఆ మూడో హీరో ఎవరన్నది తెలుస్తుంది” అంటున్నారు.