ఫేక్ వ్యూస్ విషయంలో దిల్ రాజు బయటపడిపోయారు. టీజర్, ట్రైలర్లకు డబ్బులిచ్చి వ్యూస్ కొనుక్కొంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. వ్యూస్ తో జనాల పల్స్ తెలుసుకోవొచ్చని, ఫేక్ వ్యూస్ వల్ల కాల్యుక్లేషన్ తప్పుతోందని, టీజర్, ట్రైలర్లకు మిలియన్ వ్యూస్ వచ్చినా, జనాలు థియేటర్ల వరకూ రాకపోవడానికి కారణం ఇదేనని దిల్ రాజు నిర్దారించేసుకొన్నారు.
ఫేక్ వ్యూస్ గోల ముందు నుంచీ ఉన్నదే. అది బహిరంగ రహస్యం. టీజరో, ట్రైలరో విడుదలైన గంటకే ఇన్ని లక్షల వ్యూస్ తమ సొంతం అయిపోయాయని ఘనంగా ప్రకటించుకొనే దర్శక నిర్మాతల సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తేటతెల్లమైపోయింది. వ్యూస్ కోసం డబ్బులు పెట్టడం, ఆ ఫేక్ అంకెలు చూసి మురిసిపోవడంతోనే ఓ సినిమా పతనం ప్రారంభమైపోతుంది. ఈ విషయం తెలుసుకోవడానికి నిర్మాతలకు ఇంత కాలం పట్టింది. ఫేక్ వ్యూస్ వల్ల లాభం లేదన్న నిజాన్ని దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు గ్రహించడం, దాన్ని బహిరంగంగానే వ్యక్తపరచడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం.
కాకపోతే.. ఫేక్ వ్యూస్ ని అరికట్టి నట్టే, ఫేక్ కలక్షన్లనీ అరికట్టాలి. మా సినిమా తొలి వారంలో ఇన్ని కోట్లు సాధించింది, తొలి రోజు ఇన్ని రికార్డులు బద్దలు కొట్టింది, నైజాంలో టాప్ మా సినిమానే.. ఇలాంటి ఫేక్ ప్రచారాలకు నిర్మాతలు దూరంగా ఉండాలి. అప్పుడే సినిమా బాగు పడుతుంది. ఓవర్సీస్ వసూళ్లని మభ్యపెట్టలేరు. ఎందుకంటే అక్కడ ఓ నిర్మాణాత్మకమైన వ్యవస్థ వుంది. ఏ సినిమాకు ఎంత వస్తోందన్నది స్పష్టంగా రికార్డు ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి మెకానిజం లేదు. అసలు ఎన్ని టికెట్లు తెగాయి? అందులో ఎగ్జిబీటర్కి ఎంత? డిస్టిబ్యూటర్కి ఎంత? ప్రొడ్యూసర్‌కి ఎంత? అనే లెక్కలు అస్సలు అర్థం కావు. వచ్చేవన్నీ అబద్ధపు అంకెలే. ”మేం పోస్టర్లు విడుదల చేస్తుంటే జనాలు నవ్వుతున్నారు. వాళ్లకు ఏ సినిమాతో ఎంత వస్తోందో అంతా తెలుసు. మేం వాళ్లని మోసం చేస్తున్నామనుకొని మేం మోసపోతున్నాం” అంటూ ఓ ఎగ్జిబ్యూటర్ బహిరంగంగానే తమ తప్పు ఒప్పుకొన్నాడు. కేవలం హీరోల్ని వాళ్ల అభిమానుల్నీ సంతృప్తిపరచడానికే ఈ అంకెల గారడీ. ఇది అందరికీ తెలిసిన ఆటే. ముందు దీనికి చెక్ పెట్టాలి. ఆ ధైర్యం నిర్మాతలకు ఉందా?
అసలు హీరోలే ముందుకొచ్చి ‘సినిమా రిలీజ్ అయ్యాక కలక్షన్ల గురించి పోస్టర్లు వేయొద్దు. ఫేక్ వసూళ్లు మనకొద్దు’ అని నేరుగా చెబితే ఈ సమస్యకు పుల్ స్టాప్ పడిపోయినట్టే. కానీ అది జరగని పని. హీరోలు ఈ అబధ్రతా భావం నుంచి ఎప్పటికీ బయటకు రాలేరు. ఎప్పుడూ ఈ ముసుగులోనే బతికేస్తుంటారు. వాళ్లని మభ్యపెట్టడం నిర్మాతలకు మహదానందం. ఈ ఆటలో మోసపోతోంది.. మునిగిపోతోంది నిర్మాతలే కావడం వాళ్ల దురదృష్టం.