జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిక్ మిస్టేక్‌లు చేస్తోంది. ఓట్ల చోరీ అంటూ తాము ప్రారంభించిన ప్రచారం .. ఓటమికి కారణం అనే భావన పెరగడమే కాదు.. వారు చూపించిన ఓట్లన్నీ బీఆర్ఎస్ హయాంలో నమోదు అయినవేనని వెల్లడి కావడంతో తమ వ్యూహం బ్యాక్ ఫైర్ అయిందని తెలుసుకుని నాలిక్కరుచుకుంటున్నారు.
20వేల ఓట్ల చోరీ అంటూ ప్రచారం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల దొంగ ఓట్లను చేర్చిందని కేటీఆర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేసింది. కానీ కేటీఆర్ వినతి పత్రంలో ఇచ్చిన ఓట్లలో ఒక్కటి కూడాకొత్తగా నమోదు కాదు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆ ఓట్లు జాబితాలో ఉన్నాయి. అంటే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే ఆ ఓట్లు జాబితాలోకి ఎక్కాయి?. అవి దొంగ ఓట్లు అయితే ఎవరు .. వాటిని చేర్పించినట్లు ?
వలస కార్మికులను ఓటర్లుగా చేర్పించిన నేతలు
ఓ ఇంట్లో యాభై ఓట్లు ఉన్నాయని ఆరోపణలు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ అందులో ఉన్న ఓటర్లంతా అక్కడ ఉండి పోయిన వాళ్లే. అంటే కార్మికులు. పనులు చేసుకోవడానికి వస్తారు… ఆ సమయంలో అక్కడ ఓటు నమోదు చేసుకుంటారు. రాజకీయ పార్టీల అవసరమో.. తమకు గుర్తింపు కార్డు ఉండాలనో ఇలా నమోదు చేసుకుంటారు. తర్వాత వేరే పని కోసం ఇతర చోట్లకు వెళ్లిపోతారు. వారి ఓట్లు తీసేయరు. నగరాల్లో ఉండే సమస్య ఉంది. వారు ఎవరూ వచ్చి ఓట్లు వేయరు. వేసినా అది అధికారికంగా వారికి ఉన్న ఓటు దక్కే.
నగరంలో తక్కువ ఓటింగ్ కు ఇదే కారణం!
హైదరాబాద్ ఎప్పుడు చూసినా యాభై శాతం ఓటింగ్ జరిగితే గొప్ప. నగర ఓటర్లు బద్దకిస్తారని అనుకుంటారు.కానీ సిటీలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారు. ఓటు వేయని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఓటింగ్ శాతం యాభై శాతానికి మించకపోవడానికి .. ఇలాంటి వలస ఓటర్లే కారణం. ఆ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. కానీ రాజకీయం కోసం దొంగ ఓట్లు అంటూ రాజకీయం చేస్తూంటారు. ఇప్పుడు జూబ్లిహిల్స్‌లోనూ అదే జరుగుతోంది.
ఓట్ల చోరీ పేరుతో రాహుల్ చేస్తున్న రాజకీయం ఇప్పుడు ఆయనకు బ్యాక్ ఫైర్ అయింది. ఎవరూ నమ్మడం లేదు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని పట్టుకుని రాజకీయం చేస్తే ఓటమికి ముందే కారణాలు చెబుతున్నారని అనుకుంటారు. అదే జరుగుతోంది. కేటీఆర్ ఇప్పుడు డిఫెన్సివ్ పాలిటిక్స్ ఆపేసి..ఎదురుదాడి రాజకీయాలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.