వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు తేలిపోతున్నాయి. అధికారుల్ని బెదిరించి, అడ్డగోలుగా పెట్టిన కేసులకు ఆధారాలు లేవన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు వారంతా ఆధారాల్లేవని చెబుతున్నారు. చంద్రబాబుపై స్కిల్ డెలవప్మెంట్ సెంటర్లు కేసు, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మద్యం వంటి కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఒక్క దాంట్లోనూ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. చివరికి స్కిల్ కేసులోనూ ఏమీ నిరూపించలేకపోయారు.
చంద్రబాబు కేసుల్లో సాక్ష్యాలు లేవంటున్న ఫిర్యాదుదారులు
చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలు అంటూ పెట్టిన కేసులో ఆధారాలు లేవని ఫిర్యాదుదారు సీఐడీకి తాజాగా చెప్పారు. ఫైబర్ నెట్ అక్రమాల పేరతో పెట్టిన కేసులోనూ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి, అసైన్డ్ భూముల కేసులో మాజీ సీఆర్డీఓ చెరుకూరి శ్రీధర్ వంటి ఫిర్యాదుదారులు, సాక్షులు తమ వద్ద ఆధారాలేమీ లేవని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి వారిపై లేనిపోని విచారణలు చేయించి.. తాము చెప్పినట్లుగా చేయకపోతే , నివేదికలు ఇవ్వకపోతే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరించారు. కొంత మది అధికారుల కణతకు తుపాకీ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కేసులు తేలిపోయే అవకాశం కనిపిస్తూండటంతో గగ్గోలు పెడుతున్నారు. కోర్టుల్లో విచిత్రమైన పిటిషన్లు వేస్తున్నారు.
పొన్నవోలుతో గగ్గోలు పెట్టిస్తున్న సజ్జల
బెదిరించి అధికారులతో ఇప్పించిన కేసులు కాకపోతే ఇప్పుడు వారు ఎందుకు తమ వద్ద సాక్ష్యాలు లేవని చెబుతారు. అసుల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంటే లేకపోతే.. ఒక్క గజం భూసేకరణ జరగకపోతే.. అవినీతి జరిగిందని ఎలా ఆధారాలు ఫిర్యాదు చేసిన వారు సమర్పించగలరు ? అమరావతిలో అసైన్డ్ భూముల్లో అక్రమాలే జరిగినట్లు నిరూపించలేకపోయారు. ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చంద్రబాబుపై చేసిన కుట్రల గురించి ఓ పెద్ద పుస్తకం అవుతుంది. సాక్ష్యాలు లేకపోవడంతో కేసులు నిలబడవని తెలియడంతో ది గ్రేట్ పొన్నవోలుతో ప్రెస్మీట్లు పెట్టించి న్యాయవ్యవస్థ మీద అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు అసలేం జరిగిందో న్యాయవ్యవస్థలో అందరికీ తెలుసు. అయినా ఏమీ తెలియనట్లుగా పొన్నవోలు..వైసీపీ నేతలు కళ్లు మూసుకుని పాలు తాగిన పిల్లుల్లా వ్యవహరిస్తున్నారు.
తాడేపల్లిలో జరిగిన కుట్రలన్నీ బయటకు తీసి చర్యలు తీసుకోవాల్సిందే !
ఇవన్నీ తప్పుడు కేసులు అని స్పష్టత వస్తున్నప్పుడు.. ఇలాంటి కేసుల కుట్రలు చేసిన వారిని వదిలి పెడితే అది వారికి మరింత ధైర్యం వస్తుంది. అధికారులను బెదిరించి ఎవరు తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారో.. దానికి దారి తీసిన పరిస్థితులేమిటో మొత్తం బయటకు తీయాలి. సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్ వంటి వాళ్లు చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేయడానికి అన్ని లైన్లు క్రాస్ చేసేశారు. ఓ నేరస్తుడితో చేతులు కలిపి వీరూ నేరస్తులయ్యారు. తప్పుడు కేసులు పెట్టిన వారినీ బోనులో నిలబెడితేనే మరోసారి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి వెనుకాడుతారు.
