కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలపై జరిగిన ప్రచారం అంతా కట్టు కథలేనని తేలిపోయింది. పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఆ ఆలయం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ట్రస్ట్ పై ఆధిపత్యం కోసం.. రాజకీయ కోణాలతో ఈ కుట్రలు జరిగాయి. ముందూ వెనుకా చూసుకోకుండా తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారు…?
వందల మంది మహిళల్ని చంపినట్లుగా ఫేక్ ప్రచారం
ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణ చేశాడు. కేసు పెట్టాడు. కోర్టులో పిటిషన్ వేశాడు. అందులో నిజానిజాలు ఏమిటన్న సంగతి తర్వాత కావాల్సినంత మసాలా దొరుకుతుందని చాలా మంది రెచ్చిపోయారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ప్రచారాలు చేశారు. నిజానికి ఆ ధర్మస్థల ఆలయంతో కొంచెం పరిచయం ఉన్నా.. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చే ఉంటారు. అది ఇప్పుడు నిజం అయింది. తప్పుడు ఫిర్యాదులు ఆరోపణలు చేశామని.. కారణమైన వారు చెప్పారు. వారి వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉంది.
రాజకీయాల కోసం హిందూ ప్రసిద్ధ ఆలయాలపై ఫేక్ దాడులు
ధర్మస్థల వివాదం వెనుక రాజకీయం ఉందని అందరికీ తెలుసు. ఆ రాజకీయం కారణంగా.. విపరీతమైన తప్పుడు ప్రచారం చేశారు. కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండేదో చెప్పాల్సిన పని లేదు. అక్కడ జరిగిన తవ్వకాల్లో ఏమీ దొరకకపోయినా ఏవో దొరికినట్లుగా ప్రచారం చేశారు. చివరికి అంతా ఫేక్ అని తేలింది. ఇలా టార్గెట్ చేస్తున్నది ఒక్క ధర్మస్థలనే కాదు.. ఏకంగా తిరుమలనూ టార్గెట్ చేస్తున్నారు. వరుసగా ఫేక్ న్యూస్ తో టీటీడీపై చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ హిందూత్వంపై చేస్తున్న దాడులే.
ఆలయాలపై కుట్రలకు అడ్డుకట్ట వేయాలి !
ఆలయాలు, ప్రసిద్ధ క్షేత్రాలపై జరుగుతున్న కుట్రలకు అడ్డు కట్ట వేయాల్సిన సమయం వచ్చిందని ఎక్కువ మంది అభిప్రాయం. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసి.. మీడియా, సోషల్ మీడియాల్లో ఆయా సంస్థల ప్రతిష్ట దెబ్బతినేలా చేస్తున్నారు. ఇదంతా హిందూత్వంపై జరుగుతున్నదాడిగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటివాటికి అడ్డుకట్టపడితేనే.. ఆలయాల ప్రతిష్ట మిగులుతుంది. లేకపోతే ఇలాంటి వివాదాలు పెరుగుతూనే ఉంటాయి.