లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ సీన్ ఉంది.
హీరో.. కంప్యూటర్ వాల్ పేపర్ గా తన అభిమాన హీరో నాగార్జున పిక్ పెట్టుకొంటాడు. `నీకు తిండి పెడుతోంది నేను.. బట్టలు ఇస్తోంది నేను. కాలేజీ ఫీజు కడుతోంది నేను.. మరి నాగార్జున ఎవడ్రా` అని అడిగే సీన్ అది.
దర్శకుడు ఈ సీన్‌ని ఫన్ మోడ్ లోనే రాసుకొని ఉండొచ్చు. కానీ.. ఆ సీన్ వెనుక ఓ డెప్త్ ఉంది. అభిమానం ముసుగులో వెర్రితలలు వేసే యువతరానికి చురక ఉంది. అర్థం చేసుకొనేవాళ్లకు అర్థం చేసుకొనేంత.
ఇప్పుడు తమిళనాడులో జరిగిన కరూర్ దుర్ఘటన విషయానికి వద్దాం. తమ అభిమాన నటుడు విజయ్ పై ఉన్న వెర్రి అభిమానంతో జనం తండోపతండాలుగా వచ్చారు. ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. దాంతో 40 మంది ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. ఈ దుర్ఘటనలో పరోక్షంగా విజయ్ పాత్ర ఉంది. నిర్వాహకుల వైఫల్యం ఉంది. కానీ అంతకు మించి.. అభిమానం ముసుగులో ఉన్న వెర్రితనం కూడా ఉంది.
హీరోల్ని తెరపైనే కాదు, ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ అభిమానికీ ఉంటుంది. కాదనలేం. కానీ.. ప్రాణాలు పణంగా పెట్టాల్సివచ్చినంత అభిమానమైతే కాదుగా. ఈ ఘటనలో అభం శుభం తెలియని పసి పాపలు ఉన్నారు. వాళ్ల మరణానికి కారణం ఎవరు? చిన్న పిల్లల్ని చంకలో పెట్టుకొని వెళ్లడం ఏమిటి? నీ అభిమానానికీ, ఆ పసివాళ్లకూ ఏమిటి సంబంధం? ఇంట్లో టీవీలో కూర్చుని చూస్తే అభిమానం తగ్గినట్టా? కాదు కదా..? రిస్క్ అని తెలిసి కూడా ఇలాంటి సభలకు వెళ్లడం ఎందుకు?
విజయ్ విషయంలోనే కాదు.. చాలా చోట్ల ఇదే దుస్థితి. కటౌట్ కడుతూ, విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్లని చూశాం. అభిమాన హీరోని ఏదో అన్నాడని, మరో హీరో అభిమానితో కొట్లాడి ప్రాణాలపై తెచ్చుకొన్న వాళ్ల గురించి వింటున్నాం. సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాట తాజా ఉదాహరణ. హీరో సినిమా ఫ్లాప్ అయ్యిందని మనోవేదన చెంది, ఆత్మహత్య చేసుకొన్న వాళ్ల కథలూ తెలుసు మనకు. ఇదంతా.. ఎవరి కోసం? ఎవరి మెప్పు పొందడడానికి?
జీవితం అమూల్యమైనది. అది సినిమా కంటే, స్టార్ల కంటే గొప్పది. కుటుంబాన్ని ప్రేమించడం, కన్న తల్లి దండ్రుల్ని ప్రేమించడం నేర్చుకొన్నవాళ్లకే అది అర్థం అవుతుంది. సినిమానీ, సినిమా హీరోని అభిమానించడం తప్పు కాదు. నేరం కాదు. అదుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు. అది అసలు అభిమానమే అనిపించదు. మీరు అభిమానించే స్టార్లు కూడా వాటిని సమ్మతించరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.