వరుణ్ తేజ్ కథానాయకుడిగా దిల్రాజు బ్యానర్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. శుక్రవారం నుంచి హైదరాబాద్లో షూటింగ్ మొదలవుతోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుతారు. ఈ చిత్రానికి ‘ఫిదా’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా అబ్బాయికీ, తెలంగాణ అమ్మాయికీ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. కథా ప్రకారం ఎక్కువ భాగం అమెరికాలో తెరకెక్కిస్తారు.
రెండు నెలల్లో సినిమాని పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకొంది. డిసెంబరులో విడుదల చేయాలన్నది దిల్రాజు ప్లాన్. యూత్ ఫుల్ స్టోరీలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడు శేఖర్ కమ్ముల. అనామిక తరవాత ఆయన చేస్తున్న సినిమా ఇది. స్క్రిప్టు పక్కాగా రెడీ చేయడానికి సమయం తీసుకొన్న శేఖర్.. చిత్రీకరణ మాత్రం అనుకొన్న సమయానికే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.