2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆదివారం వచ్చినప్పటికీ ఒకటో తేదీన బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్‌పై పెద్దగా ఎవరూ ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ.. ఓ మాదిరిగా అయినా అంచనాలు పెట్టుకున్నారు. కానీ నిర్మలమ్మ అత్యంత సాదాసీదాగా పద్దుల లెక్క తేల్చారు.
రూ. 53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. ఆర్థిక లోటును జీడీపీలో 4.3% కి పరిమితం చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే మూలధన వ్యయాన్ని గతంలో కంటే పెంచి రూ. 12.21 లక్షల కోట్లుగాఖరారు చేసింది. ఇది దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమివ్వనుంది. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు జరిపింది. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీరామ్ జీ పథకాన్ని ప్రకటించారు. దీనికి రూ. 95,692 కోట్లు కేటాయించింది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా రైల్వేలకు కొత్త లైన్లు, భద్రత , రోలింగ్ స్టాక్ కోసం భారీ నిధులు కేటాయించారు.
తెలుగు రాష్ట్రాలకు కొంత ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఏపీ తీర ప్రాంతంలో లభించే అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్‌ను ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు రక్షణ రంగ పరిశ్రమల వృద్ధికి దోహదపడనుంది. హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశపు ఆర్థిక ఇంజిన్‌గా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. దేశంలో ప్రకటించిన 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లలో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి అమరాతి మీదుగా వెళ్తుంది.
బడ్జెట్ అంటే ఎక్కువగా అందరూ ఎదురు చూస్తే ఆదాయపు పన్ను శ్లాబుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త ఐటీ ట్యాక్స్ ను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.
భారతదేశాన్ని గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చేందుకు, డేటా సెంటర్లు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. డేటా సెంటర్ల నిర్మాణానికి వాడే మెటీరియల్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పరికరాలపై జీఎస్టీ తర ఇన్పుట్ పన్నుల నుండి ఊరటనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాయిలాలు ప్రకారం చూస్తే.. ఈ బడ్జెట్ రంగు, రుచి, వాసన తక్కువ కావొచ్చు కానీ దేశ భవిష్యత్ ఆర్థిక నిర్మాణానికి మాత్రం చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే కేటాయింపులు ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
