ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. క్రమశిక్షణ కూడా చాలా అవసరం. అది లేకే చాలామంది తమ కెరీర్ నాశనం చేసుకొన్నారు. ఫిష్ వెంకట్ కూడా అలాంటి నటుడే. ఫిష్ వెంకట్ గొప్ప నటుడేం కాకపోవొచ్చు. కానీ అదృష్టం కొద్దీ మంచి అవకాశాలే వచ్చాయి. తనదైన టైమింగ్, టిపికల్ డైలాగ్ డెలివరీతో అవకాశాల్ని అందిపుచ్చుకొన్న నటుడు ఫిష్ వెంకట్. తన ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ ఒకేలా ఉండేది. కానీ అదే పే ఆఫ్ అయ్యేది. విలన్ గ్యాంగ్ లో కొన్ని పంచ్‌లు పంచుకొనే నెంబర్ గా.. చాలా సినిమాలు నెట్టుకొచ్చేశాడు. కొంతమంది దర్శకులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడు. వాళ్ల సినిమాల్లో వెంకట్ కు తప్పకుండా ఛాన్స్ దొరికేది. అయితే తన చివరి దశ బాధాకరంగా నడిచింది. ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కావు. ‘మాకు సహాయం చేయండి’ అని అభ్యర్థించినా ఆ గోడు ఎవరూ వినలేదు. ఆ సమయంలో తనని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చనిపోయాడు. అతని అంత్రక్రియలకు కూడా సినిమావాళ్లెవరూ వెళ్లలేదు. అలా ఓ చాప్టర్ ముగిసింది.
చాలామంది నటుల్లానే ఫిష్ వెంకట్ కొన్ని తప్పులు చేశాడు. చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొన్నాడు. రోజుకి 30 వేలు సంపాదించేవాడు. నెలకు కనీసం 5 లక్షలు వచ్చేవి. అవన్నీ జాగ్రత్త పెట్టలేకపోయాడు. చివర్లో డబ్బుల కోసం చేయి చాచాల్సివచ్చింది. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు ఎంతో కొంత వెనకేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ విషయంలో ఫిష్ వెంకట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
దానికి మూల్యం ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెల్లించుకోవాల్సివచ్చింది. ఫిష్ వెంకట్ మరణించినా చూడడానికి ఎవరూ రాలేదని, ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదన్నది కుటుంబ సభ్యుల ఆవేదన. కానీ ఎవరు పట్టించుకొంటారు? ఎందుకు పట్టించుకొంటారు? ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి బాధ వాళ్లది. అప్పటికీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆసుపత్రి ఖర్చుల్ని భరిస్తానని ముందుకొచ్చారు. కొంతమంది నటీనటులు సహాయం చేశారు. పెద్దవాళ్లెవ్వరూ ముందుకు రాలేదు అంతే. ఆరోగ్యం, క్రమశిక్షణ ఇవి రెండూ నటుడికి చాలా కీలకం. అక్కడే వెంకట్ తప్పులు చేశాడు. అందుకే అతని నిష్క్రమణ అంత బాధాకరంగా సాగిపోయింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే అనే విలువైన పాఠం వెంకట్ నేర్పించి వెళ్లాడు.