కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక షెడ్యూల్ను విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ రాష్ట్రాల శాసనసభల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఏప్రిల్, మే మే నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఈ షెడ్యూల్ ఖరారైంది.
కేరళ , అస్సాం రాష్ట్రాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుదంి. అత్యంత ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న మొదటి దశ, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు. అస్సాంలోని 126 స్థానాలు, కేరళలోని 140, తమిళనాడులోని 234, పశ్చిమ బెంగాల్లోని 294 , పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు కలిపి మొత్తం 17.4 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.
ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. తమిళనాడులో డీఎంకే కూటమి , అన్నాడీఎంకే-బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి బరిలోకి దిగడం ఆసక్తిని రేపుతోంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగనుండగా, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారీ ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


