జగన్ రెడ్డి దగ్గర పని చేసి ఆయన చెప్పిందల్లా చేసి.. చివరికి అసెంబ్లీ టిక్కెట్టో.. పార్లమెంట్ టిక్కెట్టో ఇవ్వలేదని అలిగిన విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ అధికారి పబ్లిసిటీ కోసం పాట్లు పడుతున్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తే పబ్లిసిటీ వస్తుందని పవన్ కల్యాణ్‌పై హైకోర్టులో ఓ పిటిషన్ పడేశారు. అదేమిటంటే.. హరిహరవీరమల్లు సినిమా ప్రచారానికి ప్రభుత్వ ధనం వాడుకున్నారట. ఎంత వాడుకున్నారు.. ఎలా వాడుకున్నారన్న వివరాలతో పిటిషన్ వేశారో లేదో కానీ.. పవన్ పై పిటిషన్ అనే సరికి..పబ్లిసిటీ వచ్చేసింది.
పిటిషన్ లో ఆయన అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్లుగా.. ఏసీబీ, సీబీఐ, ఈడీ ఇలా దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలన్నింటి విచారణ కావాలన్నట్లుగా కోరిక వ్యక్తం చేశారు. కోర్టు రొటీన్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసింది. అసలు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రచారానికి ప్రజాధనం ఎక్కడ వాడుకున్నారో చెప్పాల్సి ఉంది. ఈ విజయ్ కుమార్ జగన్ రెడ్డి సీఎం అయ్యాక.. చేసిన భజన వీడియోలు యూట్యూబ్ లో ఉంటాయి. ఇతను ఐఏఎస్సేనా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు కూడా.
అమరావతిపై తప్పుడు నివేదికలు తీసుకు రావడంలో ఆయనదే కీలక పాత్ర. అమరారాజా కంపెనీ కాలుష్యం అంటూ ఫేక్ రిపోర్టులు తీసుకు వచ్చి పది వేల కోట్ల విలువైన పెట్టుబడుల్ని కూడా తెలంగాణకు తరిమేసిన రికార్డు ఆయనదే. అన్నీ చేసినా జగన్ చివరికి పట్టించుకోలేదు. అందుకే ఓ పాదయాత్ర చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ పార్టీ పెట్టుకున్నారు. ఎక్కడ పోటీ చేశారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మళ్లీ పబ్లిసిటీ కోసం పవన్ పై పిటిషన్లు వేస్తున్నారు. కనీసం మళ్లీ జగన్ పిలిచి ఓ వీరతాడు వేస్తాడని ఆశకావొచ్చు.