తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు , మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. దాదాపుగా రెండేళ్ల పాటు విదేశాల్లో ఉండి.. డిపోర్టు చేయాల్సిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నుండి అరెస్టు నుంచి రక్షణ పొంది తిరిగి వచ్చిన ఆయన, జైలుకు వెళ్లకుండానే కోర్టు నుండి రెగ్యులర్ బెయిల్ పొందారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ నాయకులు, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్ర అత్యంత కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు జైలు శిక్ష అనుభవించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును కూడా చాలా సార్లు విచారించారు. దీంతో బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేసిన కోర్టు, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని ఆయనకు కఠిన నిబంధనలు విధించింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అత్యంత కీలకమైన అంతిమ దశకు చేరుకుంది. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ధ్వంసం, డాటా రికవరీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు ఇప్పటికే పోలీసుల చేతికి అందాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అదృశ్య హస్తాలపై స్పష్టత తెచ్చేందుకు సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ప్రయత్నిస్తోంది.
