ఐపీఎస్ భార్య అంటే .. అంతో ఇంతో నేరాలపై, మోసాలపై అవగాహన ఉంటుందని అనుకుంటారు. ఎందుకంటే పోలీసులే నేరాల గురించి ఎక్కువగా చెబుతూంటారు. మోసపోవద్దని అవగాహన కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా సైడర్ నేరాలు, మోసపూరిత ట్రేడింగుల గురిచి ఎక్కువగా ప్రచారం చేస్తూంటారు. కానీ వారి కుటుంబసభ్యులే ట్రాప్ లో ఇరుక్కుని కోట్లు కోల్పోతూంటారు. అలాంటి పరిస్థితే మాజీ ఐపీఎస్ వీవీ లక్ష్మినారాయణకు ఎదురైంది. ఆయన భార్య ఫేక్ ట్రేడింగ్ మోసంతో రెండున్నర కోట్లు కోల్పోయారు.
భారీ లాభాలని వాట్సాప్ మెసెజ్ – జేడీ భార్య పెట్టుబడి
స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతుంది. లాభాలే లాభాలని..మల్టీబ్యాగర్ షేర్లు అని వాట్సాప్ గ్రూప్ లో జాయినింగ్ కు ఆహ్వానం వచ్చింది. జేడీ భార్య ఆ వాట్సాప్ గ్రూపులో చేరారు. అదీ ఇదీ చెప్పి ఆమెతో పెట్టుబడులు పెట్టించడం ప్రారంభించారు. ఆరు నెలల పాటు ఆమెతో రెండున్నర కోట్ల పెట్టుబడి పెట్టించారు. నిజానికి పెట్టుబడి పేరుతో వసూలు చేశారు. ఆమె ఖాతాలో బోలెడంతో డబ్బు ఉందని చూపించారు. కానీ తీసుకోవడానికి సాధ్యం కాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడు విషయం జేడీకి తెలియడంతో ఆయన ఇదంతా మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల పెరిగిన ట్రేడింగ్ మోసాలు
తొలుత వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా బాధితులకు గాలం వేసే నేరగాళ్లు, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థల పేర్లను వాడుకుంటారు. షేర్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపి, తమకు తామే సృష్టించుకున్న ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్లలో డబ్బులు డిపాజిట్ చేయిస్తారు. ఈ తరహా మోసాల్లో నేరగాళ్లు బాధితులకు నమ్మకం కలిగించడానికి తొలుత చిన్న మొత్తంలో లాభాలను డిపాజిట్ చేస్తారు. బాధితులు తమ ఖాతాలో లాభాలు పెరుగుతున్నట్లు స్క్రీన్‌పై చూసి, అది నిజమని నమ్మి భారీ మొత్తంలో పెట్టుబడులు పెడతారు. అయితే, ఆ సొమ్మును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాత్రం.. ట్యాక్సులు కట్టాలని, ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని మరిన్ని డబ్బులు గుంజుతారు. చివరికి బాధితులు తాము మోసపోయామని గ్రహించేలోపే నిందితులు ఆ ఖాతాలను మూసివేసి పరారవుతారు.
జాగ్రత్తలు పాటిస్తేనే భద్రత
అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. సెబీ గుర్తింపు పొందిన బ్రోకరేజ్ సంస్థల ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ముఖ్యంగా భారీ లాభాలు వస్తాయని వాగ్దానం చేసే యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. గుర్తుంచుకోండి, అతి తక్కువ సమయంలో అపరిమిత లాభాలు ఎక్కడా సాధ్యం కాదనే విషయం మనసులో పెట్టుకుంటే మోసానికి గురి కాకుండా ఉండవచ్చు.
