తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలక నిర్ణయాలు ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి. చాలా రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలకు ఈ అంశంపై అనుమానాలు ఉన్నా.. హిల్ట్ పాలసీ గురించి పూర్తి స్థాయిలో కేబినెట్‌కు కూడా వివరాలు తెలియక ముందే.. బీఆర్ఎస్కు తెలిసిపోవడంతో కోవర్ట్ చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నారని క్లారిటీ వచ్చింది. ఈ అంశంపై విజిలెన్స్ దర్యాప్తు చేసిది. నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను సీఎం వద్ద ఉంచారు చీఫ్ సెక్రటరీ.
అసలు కోవర్ట్ ఎవరో కాంగ్రెస్ పెద్దలకు తెలిసిపోయిందని చెబుతున్నారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా ఉన్న ఆయన సిన్సియారిటీని రేవంత్ నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా నుంచి వచ్చిన ఆయనకు నామినేటెడ్ పదవిని చాలా ముందుగానే ప్రకటించారు. సీఎంతో నిత్యం సమావేశాల్లో పాల్గొనేంత కీలక పదవి ఇచ్చారు. తర్వాత రాజ్యాంగబద్దమైన పదవి ఇచ్చారు. పదవి ఏదైనా తనకు ఉన్న చనువుతో కీలక విషయాలను తెలుసుకునేవారు . వాటిని గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు పంపుతున్నారు. హిల్ట్ పాలసీ కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇలా ఫార్వార్డ్ అయ్యాయని చెబుతున్నారు. కేటీఆర్ వాటిని చూపించే ముందే ప్రెస్ మీట్ పెట్టారు.
అయితే రేవంత్ చాలా నమ్మకం పెట్టుకున్న ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కుమ్మక్కయ్యారని.రేవంత్ కు ఎందుకు ద్రోహం చేశారన్నది హైలెవల్లో జరుగుతున్న చర్చ. దీనికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. డబ్బుతో పాటు హనీట్రాప్ బారిన పడ్డారని.. బ్లాక్ మెయిల్ కారణంగానే ఇలా కోవర్టుగా మారారని అంటున్నారు. ఆయన ఎవరో.. ఇప్పటికే కొంత మందికి స్పష్టత వచ్చింది. రేవంత్‌కూ తెలిసిపోయి ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఇది నమ్మకద్రోహం కావడంతో.. క్షమించే అవకాశాలు ఉండవని అంచనా వేస్తున్నారు.
