తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గొర్రెల పంపిణీ స్కాం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు తలసానికి ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ కుమార్ అనే ఉద్యోగిని ఈడీ అరెస్టు చేసింది. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు కూడా పట్టుబడింది. ఈడీ కేవలం మనీ లాండరింగ్ వ్యవహారాలపైనే దర్యాప్తు జరుపుతుంది. కల్యాణ్ ..తలసానితో లేదా ఆయన సన్నిహితులతో ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిపి ఉంటే.. కేసు ఆయన దగ్గరకూ వస్తుంది.
ప్రభుత్వం మారగానే.. గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పత్రాలన్నీ మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఎక్కడిక్కడక ఫైల్స్ అన్నీ తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈడీ అరెస్టు చేసిన ఈ కల్యాణ్ కుమారే స్వయంగా ఫైళ్లు తీసుకెళ్తూ దొరికిపోయారు. కానీ ప్రబుత్వం మారింది కాబట్టి ఆఫీసు ఖాళీ చేస్తున్నారని ఎక్కడికి తరలించలేదని రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద భద్రంగా ఉన్నాయని అప్పట్లో తలసాని వర్గీయులు వాదించారు. ఈ కేసులో ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. అయితే తలసాని వరకూ రాలేదు.
తలసాని ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ సికింద్రాబాద్ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు నిరాకరించారు. మళ్లీ ఇటీవలే కాస్త పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ల అంశం వచ్చినా గతంలో చూపించినంత దూకుడు చూపించడం లేదు. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది.