ఫార్ములా-ఈ రేసు కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించింది. ఈ కీలక పరిణామంతో తెలంగాణ ఏసీబీ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్‌పై కూడా విచారణకు లైన్ క్లియర్ కావడంతో ఈ వారంలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది.
ఏసీబీ చార్జిషీట్ సిద్ధం
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు తరలించడంలో అర్వింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాల మేరకు క్యాబినెట్ ఆమోదం లేకుండానే దస్త్రాలను వేగంగా కదిలించారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ లావాదేవీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కేవలం నిధుల పరంగానే కాకుండా, జరిమానాల రూపంలోనూ భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది.
అర్వింద్ కుమార్ అప్రూవర్‌గా మారుతారా?
ప్రస్తుతం రాజకీయ , అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ అర్వింద్ కుమార్ అప్రూవర్‌గా మారుతారా అనే అంశంపై సాగుతోంది. ఐఏఎస్ అధికారిగా తన కెరీర్ , భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ కేసులో తాను కేవలం పైస్థాయి ఆదేశాలను మాత్రమే అమలు చేశానని చెబుతూ, అసలు సూత్రధారుల వివరాలను వెల్లడించేందుకు ఆయన సిద్ధమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అప్రూవర్‌గా మారితే, ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో కేటీఆర్ తనకేం సంబంధమని.. అంతా అధికారులే చేశారని వాదించే ప్రయత్నం చేశారు. అంటే అర్వింద్ కుమార్ ను బలి చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఇది కూడా ఆయన అప్రూవర్‌గా మారేందుకు కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ముసురుతున్న రాజకీయ సెగ
ఈ కేసు కేవలం ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినది మాత్రమే కాకుండా, గత ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులను చుట్టుముట్టేలా ఉంది. నిధుల బదిలీలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అటు ఈడీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, కోర్టు ఇచ్చే సమన్ల ఆధారంగా అరెస్టులు, తదుపరి కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది.
