తెలుగు రాష్ట్రాల్లో పేదలకు అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అమరావతిలో భూమిపూజ నిర్వహించారు . తుళ్లూరు గ్రామం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ భూమిపూజ జరిగింది. ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్యాన్సర్ వైద్య నిపుణులు డా. దత్తాత్రేయుడు నోరి, డా. పోలవరపు రాఘవ రావు, డా. గడ్డం దశరథరామి రెడ్డి వంటి వారు ఈ ఆస్పత్రి నిర్మాణానికి సహకరిస్తున్నారు. వారు కూడా భూమి పూజకు హాజరయ్యారు.
ఆస్పత్రిని మూడు దశల్లో నిర్మించనున్నారు. మొత్తం వెయ్యి పడక ఆస్పత్రిగా నిర్మిస్తారు. మొదటి దశలో మూడు వందల పడకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఇందు కోసం దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉంది. మూడు దశలకు భారీగా ఖర్చు పెట్టనున్నారు. ఏడాదిన్నరలో మొదటి దశ ఆస్పత్రిని రోగుల కోసం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
నిజానికి ఈ ఆస్పత్రి నిర్మాణం ఈ పాటికి పూర్తి కావాల్సింది. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా ముందుకు అడుగు పడలేదు. కొన్ని వందల కోట్లు వెచ్చించి ఆస్రత్రిని నిర్మించనున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో హైదరాబాద్లోని ఆస్పత్రి కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చేవారు. నిరుపేదలకు కాన్సర్ వైద్యం దాదాపుగా ఉచితంగా అందిస్తారు. విరాళాలు ఎన్నారైలు ఇస్తూంటారు. ఈ ఆస్పత్రి ఏపీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం అతి తక్కువకు అందించవచ్చని భావిస్తున్నారు.
బాలకృష్ణ సొంత డబ్బులను కూడా ఆస్పత్రికి కేటాయిస్తూ ఉంటారు. ఆయన ప్రకటనల్లో నటిస్తే వచ్చే సొమ్మును క్యాన్సర్ ఆస్పత్రికే ఇచ్చేస్తూంటారని చెబుతూంటారు. లాభాపేక్ష లేకుండా పూర్తిగా ఆస్పత్రి నిర్వణను సేవా దృక్పథంతోనే నిర్వహిస్తూ.. పేదలకు అద్భుతమైన సేవలు అందిస్తోంది. ఏపీలో వేగంగా నిర్మితమైతే.. కొన్ని వేల మంది క్యాన్సర్ రోగులకు సాయంగా ఉంటుంది.