యేడాది చివర్లో సినిమాలన్నీ వరుస కడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చూపిస్తున్నా, వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోతున్నా.. ఎవ్వరూ తగ్గడం లేదు. తమ సినిమా పేరు ఎలాగైనా 2016 డైరీలో ఉండాల్సిందే అని పట్టుబట్టిన సినిమాలన్నీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ధృవ కోసమో, పెద్ద నోట్ల రద్దు ప్రభావం తగ్గాలనో చూసిన సినిమాలు ఇంకొన్ని… ఆ ఎఫెక్ట్ తగ్గాక బాక్సాఫీసు ముందుకు రావడానికి సమాయాత్తం అవుతున్నాయి. అందులో భాగంగా ఈ వారం నాలుగు సినిమాలొస్తున్నాయి. నాన్న – నేను – నా బోయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరు కోటీశ్వరుడు, అమీర్ పేట్లో, చిన్నారి… ఇవీ శుక్రవారం ఫైటింగ్‌కి దిగుతున్న సినిమాలు. అన్నీ చిన్నవే. కానీ ఏం చెప్పగలం? ఏ సినిమా ఎప్పుడు ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో..?
నాలుగు సినిమాల్లో రెండు సినిమాలపై క్రేజ్ఉంది. దిల్‌రాజు ట్యాగ్ లైన్‌తో వస్తున్న నాన్న – నేను – నా బోయ్ ఫ్రెండ్స్‌కి ఎక్కువ టికెట్లు తెగే అవకాశాలున్నాయి. కుమారి 21 ఎఫ్‌తో క్రేజ్ సంపాదించుకొన్న హెబ్బా పటేల్ ఈ సినిమాకి కథానాయిక కావడం, ట్రైలర్లు ఆకట్టుకోవడం, యూత్ ఫుల్ సినిమా లుక్కు రావడంతో ఆడియన్స్ ఈ సినిమాపై దృష్టి పెట్టారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కీ అంతో ఇంతో క్రేజ్ ఉంది. దానికి కారణం.. ఫృథ్వీ. కమెడియన్‌గా దూసుకుపోతున్న ఫృథ్వీ హీరోగా నటించిన సినిమా ఇది. సలోనితో డ్యూయెట్లు కూడా పాడేశాడు. ఫృద్వీ కామెడీనే ఈ సినిమాని గట్టెక్కించాలి. అమీర్ పేట్ లో ఫుల్ యూత్ సబ్జెక్ట్! మారుతి సినిమా ‘ఈరోజుల్లో’ టైపులో ఆడినా ఆడొచ్చు. ఉపేంద్ర సతీమణి ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన ‘చిన్నారి’ ఓ హారర్ థ్రిల్లర్. నాలుగూ నాలుగు రకాలైన కథలు. మరి ప్రేక్షకుల ఓటు దేనికి పడుతుందో చూడాలి.