తెలంగాణలో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీలో ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్న మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు ఈ శుభవార్తను ప్రకటించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హమీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెరవేర్చబోతున్నారన్నమాట.
ఈ పథకం హడావిడిగా అమలు చేస్తే తెలంగాణ తరహలో విమర్శలు వస్తాయని చంద్రబాబు ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఈ పథకం అమలు తీరుతెన్నెలను తెలుసుకోవాలని అప్పట్లోనే ఆదేశించారు.
దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం హామీల అమల్లో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.