ఉచిత బస్సు పథకం మీద వ్యతిరేక ప్రచారం చేసేందుకు కొంత మంది అదే పనిగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగినా ఉచిత బస్సు వల్లే అంటున్నారు. ఆ పథకాన్ని తీసేయాలని సోషల్ మీడియాలో ఉద్యమాన్ని ప్రారంభించేలా మాట్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. అంటే ఫ్రీబస్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఓ ఆర్గనైజ్డ్ ప్రచారం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటకు.. చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదానికి కూడా ఉచిత బస్సుకే లింక్ పెట్టారు. ఉచిత బస్సులు పెట్టడం వల్లే అలా జనం ప్రయాణిస్తున్నారని.. ఆలయాలకు వెళ్తున్నారన్న వితండవాదం చేస్తున్నారు. కాస్త ఆలోచిస్తే ఇంత తెలివితక్కువ వాదనలు వినిపించేవారు ఉండటం దురదృష్టం అనుకోవాలేమో ?
కాశీబుగ్గ ఆలయానికి ఉచిత బస్సు వల్లే భక్తులు వచ్చారట !
ఎప్పుడూ రెండు వేల మంది వచ్చే భక్తులు కార్తీక శనివారం రోజు పాతిక వేల మంది వచ్చారని కాశీ బుగ్గ ఆలయ నిర్వాహకులు పండా ప్రకటించారు. అంతే స్వయం ప్రకటిత మేధావులు ఉచిత బస్సు వల్లే అని బయలుదేరారు. పాతిక వేల మంది రావాలంటే ఎన్ని ప్రత్యేకబస్సులు పెట్టాలో వీరికి తెలియదు. నిజానికి చనిపోయిన భక్తులు అంతా ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే. వారు ఎక్కువగా వచ్చింది బస్సులు ఎక్కి కాదు. ఆ విషయం కళ్ల ముందు ఉన్నా సరే కొంత మంది ఆ పథకాన్ని ఎత్తేయాలంటున్నారు. బస్సులు ఉచితం కావడం వల్లనే కిక్కిరిసిపోతున్నాయని వీరి వాదన. అంతకు ముందు వారు కార్లలో వెళ్లేవారా అంటే వీరి వద్ద సమాధానం ఉండదు. ఉచితమే అని చెప్పి సరదాగా తిరుగుదామని అనుకునేవారు ఎవరూ ఉండరు. అలా అనుకున్నా.. ఒకటి, రెండు సార్లకే వారికీ చిరాకు పుడుతుంది. పని ఉన్నప్పుడే బస్సు ఎక్కాలనుకుంటారు.
తాండూరు బస్సు ప్రమాదమూ ఉచిత బస్సువల్లేనని నిందలు
తాండూరులో యాభై మంది ఎక్కాల్సిన బస్సులో 70 మంది ఎక్కారని.. ఉచిత బస్సు పథకమే దీనికి కారణం అని కొంత మంది వాదించడం ప్రారంభించారు. నిజానికి తాండూరు హైదరాబాద్ బస్సులు.. తెల్లవారుజామున కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని సర్వీసులు ఉన్నా అలాగే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కు విద్య, ఉపాధి కోసం వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఉచితం కాకపోయినా చేవెళ్ల బస్సులో ప్రయాణించే వారు తగ్గేవారు కాదు. అందరూ ఏదో ఓ పని మీద వస్తున్నవారే కానీ.. సరదాగా బస్సు ఎక్కిన వారు లేరు. బస్సుల్లో ఓవర్ లోడ్ ప్రయాణికులు అంటే.. ఎప్పుడైనా సహజమే. కొండ గట్టులో బోల్తాపడి 70 మందికిపైగాచనిపోయిన ఘటనలో .. బస్సులో వంద మంది ఉన్నారు. అప్పుడు ఉచిత బస్సు లేదు.
నిరుపేదలకు పనికొచ్చే పథకాలపై కుట్రలెందుకు?
మిగతా పథకాల విషయంలో ఏమో కానీ.. ఉచిత బస్సు మాత్రం మహిళల విద్య, ఉపాధి విషయాల్లో ఎంతో మేలు చేస్తుంది. చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు. చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఎంతో ఉపయోగం.. ఆర్థికంగా లాభం కూడా. ఇలాంటి పథకాలపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. అలా చేయడం ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది. ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందా లేదా అన్నది అసలు ఆలోచించకూడదు.. ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నదే ముఖ్యం. వ్యతిరేక ప్రచారం చేసే వారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              