విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఎట్టకేలకి మోక్షం వచ్చినట్లే కనిపిస్తోంది. మొదట జపాన్ కి చెందిన జైకా అనే సంస్థ దీని నిర్మాణం కోసం అప్పు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది కానీ దానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య జరిగిన చర్చలలో కొన్ని షరతులపై అంగీకారం కుదరకపోవడంతో ఆ సంస్థ తప్పుకొంది. దాని స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఏజన్సీ ఫ్రెంచ్ డెవలప్మెంట్ అనే సంస్థ 300 మిలయన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దానితో సెప్టెంబర్ 2వ తేదీన ఒప్పందం చేసుకొంటామని విజయవాడ మెట్రో ఎండి రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టుకి సుమారు రూ. 6,823 కోట్లు ఖర్చవుతుందని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు.
పుష్కరాల కారణంగా భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిదులు విడుదల చేయడంలో ఆలస్యమైంది. కానీ కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక ప్రభుత్వం చేతిలో సిద్దంగా ఉంది. దానిని నిర్మించడానికి ఈ శ్రీధరన్ సిద్దంగా ఉన్నారు. భూసేకరణకి అవసరమైన డబ్బుని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఫ్రెంచ్ సంస్థ అవసరమైన నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. కేంద్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కనుక ఇక ఎటువంటి అవాంతరాలు లేవనే భావించవచ్చు. త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి 2019 ఫిబ్రవరి నాటికల్లా విజయవాడలోని పెనమలూరు-పి.ఎన్.బస్టాండ్ మధ్య మెట్రో కారిడార్ నిర్మాణం పూర్తి చేయాలనుకొంటున్నామని రామకృష్ణా రెడ్డి చెప్పారు.