Funky Movie Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
అనుదీప్ దగ్గర ఓ యునిక్ క్వాలిటీ ఉంది. మామూలు మాటలతోనే జిమ్మిక్కులు చేస్తుంటాడు. ఒకే మాటని అటు తిప్పి, ఇటు తిప్పి అందులోంచే కామెడీ పుట్టిస్తుంటాడు. జాతిరత్నాలు లో ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. ప్రిన్స్ సినిమా బాక్సాఫీసు దగ్గర అంతగా ఆడలేదు కానీ, అందులో కొన్ని ట్రాకులు బాగుంటాయి. ఇప్పుడు ‘ఫంకీ’ తీశాడు. ‘ఈ సినిమాలో కథ ఉండదు.. ఎమోషన్ ఉండదు.. కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది’ అని నిర్మాత నాగవంశీ మైకులు పగిలేలా.. ముందస్తుగానే ప్రిపేర్ చేశారు. ఆడియన్స్ కూడా ఇందులో కామెడీ పిండుకొందామనే వస్తారు. మరి ఈ ఫంకీలో ఆ ఫన్ ఎంత వరకూ వర్కవుట్ అయ్యింది? అనుదీప్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో విశ్వక్ సేన్ ఎంత వరకూ ఇమిడిపోయాడు?
కోమల్ (విశ్వక్సేన్) ‘ఫంకీ’ అనే సినిమాని మొదలెడతాడు. నాలుగు.. నాలుగు అని నలభై కోట్ల బడ్జెట్ అవుతుంది. ఆ అంకెలు చూసిన నిర్మాత (నరేష్) గుండాగి ఆసుపత్రి పాలవుతాడు. ఆ తరవాత.. కూతురు చిత్ర (కయాదు లోహర్) రంగప్రవేశం చేస్తుంది. మిగిలిన సినిమాని కోటి రూపాయలతో పూర్తి చేయాలన్న షరతుతో సినిమాని మళ్లీ పట్టాలెక్కిస్తారు. అనుకొన్నట్టుగానే సినిమాని కోటి రూపాయల్లో పూర్తి చేశారా, అందుకోసం కోమల్ ఏం చేశాడు? ఈ ప్రయాణంలో చిత్రకి ఎలా దగ్గరయ్యాడు? అనేది మిగిలిన కథ.
కథంతా విన్న తరవాత ఇంత సింపుల్ కథని దర్శకుడు ఎలా చెప్పి ఒప్పించాడో అనిపిస్తుంది. అందుకే నాగవంశీ కూడా ‘మా సినిమాల్లో కథేం లేదు’ అని ముందు నుంచీ హింట్ ఇస్తూనే ఉన్నాడు. నిజానికి ఈ సినిమాలోని కథ ఇది కాదు. కోమల్ కి ఎమోషన్స్, రిలేషన్స్ అంటే పెద్దగా పట్టింపు ఉండదు. బంధాలు, బంధుత్వాల్ని లైట్ తీసుకొంటాడు. తనలోని ప్రేమని వ్యక్తపరచడం కూడా ‘గలీజ్’ అనుకొంటుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలో చిత్ర అనే అమ్మాయి వస్తుంది. ఆ తరవాత తన జీవితం మారిందా లేదా? ఎమోషన్స్ పట్ల విలువ పెరిగిందా లేదా అనేదే కథ. దీన్ని చెప్పడానికి అనుదీప్.. ‘సినిమా’ అనే బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొన్నాడు. సినిమా అనేది సబ్ ట్రాక్. ఎమోషన్స్ అనేది మెయిన్ ట్రాక్. కానీ ఈ కథని చెప్పే విధానం చూస్తే, పాత్రల నడవడిక, స్క్రీన్ ప్లే చూస్తే.. సబ్ ట్రాక్ మెయిన్ ట్రాక్ లా, మెయిన్ ట్రాక్ సబ్ ట్రాక్ లా అనిపిస్తుంది. హీరోకి ఎమోషన్స్, రిలేషన్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదన్న విషయం క్లైమాక్స్ కి ముందు తప్ప ఆడియన్ కి అర్థం కాదు. కథలోని మెయిన్ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ప్రీ క్లైమాక్స్ వరకూ ఆగాడంటే, అసలు ఈ స్క్రీన్ ప్లే ఎలా రాసుకొని ఉంటాడో అర్థం చేసుకోవొచ్చు.
అనుదీప్ వన్ లైనర్లు, పదాలతో ఆడే ఆట బాగుంటుంది. ఇందులోనూ అలాంటివి కొన్ని పండాయి. కానీ సినిమా అంటే ఇది మాత్రమే కాదు. స్థూలంగా కథ, ఎమోషన్స్. అవి అనుదీప్ పంచ్‌ల ముందు తేలిపోయాయి. ‘మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి’ అని డాక్టర్ సీరియస్ గా అంటుంటే `నాకు ఆపరేషన్ చేయడం రాదు డాక్టర్` అని అమాయకంగా చెప్పడం ఫన్నీగానే అనిపిస్తుంది. కానీ ఆ పంచ్ వేయడానికి ఓ క్యారెక్టర్ సృష్టించి.. సీన్‌ని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ ఆడియన్ కి రాకూడదు. `ఫంకీ`లో ఇలాంటి పంచ్‌ల కోసం బలవంతంగా ఇరికించిన సీన్లు చాలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ నవ్విస్తాయి. కానీ సెకండాఫ్‌లో అయితే కథ, కథనాలు పూర్తిగా గాడితప్పేస్తాయి. పెళ్లి తంతు దగ్గర హీరో పెద్దరికం చూపించే సీన్ కూడా తేలిపోయింది. అనుదీప్ అండ్ గ్యాంగ్ చేసే అల్లరి కూడా ‘చాణక్యం అమాయకం ఇరికించం’ అన్నట్టుగానే ఇరికించేశారు. దిల్ రాజు, నాగవంశీ, హరీష్ శంకర్ కామియోలు చేశారు. సినిమాకు సంబంధించిన కథ కాబట్టి, ఆయా కామియోలు బాగానే కుదిరాయి. అలా చెప్పుకోవడానికి మినహాయిస్తే `ఫంకీ`లో స్పెషల్ గా ఏమీ లేకుండా పోయింది.
విశ్వక్ అనుదీప్ ని అనుకరించేశాడు. తెరపై విశ్వక్ ని చూస్తున్నట్టు లేదు. అనుదీప్ ని ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. విశ్వక్ ఆడుతూ పాడుతూ చేసేశాడు. కయాదు అందంగా ఉంది. పాత్రకు కుదిరింది. కానీ చివర్లో వచ్చిన మాస్ సాంగ్ మాత్రం ఆమెకు సరిపడలేదు. నరేష్ క్యారెక్టర్ ఇంకాస్త బాగా డిజైన్ చేసుకొంటే బాగుండేది. విలన్ పాత్రని వెరైటీ అనుకొన్నారు కానీ, అది కూడా తేలిపోయింది. తన ట్రాక్ ఏమాత్రం పండలేదు.
భీమ్స్ పాటల్లో రామ్ మిరియాల పాడిన పాట బాగుంది. కానీ పిక్చరైజేషన్ కుదర్లేదు. మంచి పాటని పాడు చేశారనిపించింది. మిగిలిన పాటలు గుర్తుండవు. ప్రొడక్షన్ క్వాలిటీ ‘సితార’ బ్యానర్ స్థాయిలో లేదు. ఈ సినిమాలో హీరో కి హీరోయిన్ కండీషన్ పెట్టినట్టు `ఈ సినిమాని ఇంతలోనే తీయాలి` అని స్ట్రిక్ట్ గా రూల్ పెట్టినట్టు ఉన్నారు. అందుకే కొన్ని చోట్ల చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలేమాత్రం పేలని కొన్ని సీన్లు ఉన్నాయి. వాటిని పూర్తిగా ఏరి పారేయాల్సిన బాధ్యత ఎడిటర్ దే. అనుదీప్ వన్ లైనర్లమీద పదాల గారడీ మీద దృష్టి తగ్గించాలి. అవన్నీ జాతిరత్నాలు సినిమాలో చూసేశాం. ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. పాత జోకుల్నే, పాత పేట్రన్‌లో చెబుదామంటే కుదరదు. పైగా అనుదీప్ బయట ఎక్కువ కామెడీ చేస్తుంటాడు. వాటితో పోలిస్తే… థియేటర్లో చేసిన కామెడీ డోసు తగ్గింది.
తెలుగు360 రేటింగ్: 2.25/5
