“అమెరికాలో చదువుకున్నంత మాత్రాన నాయకుడు కాదు. ముందు చక్కగా పార్టీ నడుపుకోవాలి. డబ్బులిచ్చి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించడం నాయకత్వం కాదు” .. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారమే బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన చాలా గౌరవంగా రాజీనామా లేఖ రాశారు. కేసీఆర్ చాలా అవకాశాలు ఇచ్చారన్నారు. కానీ ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆయనతో పాటు ఆయన భార్యపైనా కామెంట్లు చేయడం ప్రారంభించారు. అంతే కాదు గువ్వల బాలరాజును బచ్చాగాడని విమర్శించడం ప్రారంభించారు. దాంతో ఆయన కూడా ఆ తీరులో రెస్పాండ్ కావాల్సి వచ్చింది.
వలసపోతున్న నేతలపై వ్యక్తిగత విమర్శలెందుకు ?
ఓ నేత పర్మినెంట్ గా ఒకే రాజకీయ పార్టీలో ఉండటం ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యం. తనకు ఉన్న పార్టీలో భవిష్యత్ లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా దారి చూసుకుంటారు. ఆ లీడర్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని అనుకున్నప్పుడు ఆ.. పార్టీ అతను పోతే పోయాడని లైట్ తీసుకోవాలి. రాజకీయంగా విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా తీసుకుని తిట్లు, హెచ్చరికలు, బెదిరింపులు చేయడం మాత్రం రివర్స్ అవుతుంది.ఇప్పుడు బాలరాజు విషయంలో అదే జరుగుతోంది.
అగ్లీకి మారిపోయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా
సోషల్ మీడియాతో దున్ని పారేయవచ్చన్న ఓ భయంకరమైన ఆలోచనలో బీఆర్ఎస్ కొత్త నాయకత్వం ఉంది. కొంతమందిని హైర్ చేసుకుని.. తమను వ్యతిరేకించే వారందరిపైనా బూతులందుకోవడం .. వాళ్లను తిట్టి ఆ వీడియోలు ప్రసారం చేయడం అనేది ఓ రోగంగా మారింది. ఏమీ జరగని దగ్గర ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసేసి సంతృప్తి పడటం ఇందులో ఓ విధానం. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లు బీఆర్ఎస్..సోషల్ మీడియా టీంను.. వైసీపీ సోషల్ మీడియా టీంతో పోలుస్తున్నారు. వాళ్ల వల్ల ఒక్క ఓటు అదనంగా రాకపోగా.. ఘోరమైన ట్వీట్ల వల్ల అసలు ఫ్యాన్స్ కూ చిరాకొస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ స్థాయికి చేరిపోయింది.
గ్రౌండ్ లెవల్ పోరాటాలేం చేశారు ?
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పటి వరకూ గ్రౌండ్ లెవల్లో చేసిన పోరాటం ఏమీ లేదు. ముఖ్యంగా ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఏదైనా కార్యక్రమాలు పెడితే.. అవి రాజకీయ కారణాలతో పెడుతున్నారు. పార్టీ సమస్యలపై పెడుతున్నారు. కేసీఆర్ సమస్యల మీద పెడుతున్నారు కానీ.. నిఖార్సుగా ఒక్క ప్రజా సమస్య కోసం ఇప్పటి వరకూ పోరాటం చేయలేదు. ఇక ప్రజలు ఎందుకు ఆ పార్టీని పట్టించుకోవాలి ?. స్పష్టమైన దిశానిర్దేశం లేక బీఆర్ఎస్.. ముందుకు వెళ్లిపోగా.. దిగువకు వెళ్లిపోతోంది.