పెళ్లికి వెళ్లేది అక్షింతలు వేసి ఆశీర్వదించడానికే. అక్షింతలు వేసినందుకు లక్షలు లక్షలు ఇస్తానంటే..
వారెవా.. బంపర్ ఆఫర్ అంటూ ఎగురుకొంటూ వెళ్లిపోరూ…? కడుపారా పెళ్లి విందు తిని, ఓ కిళ్లీ వేసుకొని.. వస్తూ వస్తూ పదో, పాతికో లకారాలు తెచ్చుకొంటే, అందులో కొంత భాగం ముందే అడ్వాన్స్‌గా ముడితే – అంతకంటే అద్భుతం, ఆనందం ఇంకేముంటుంది?
గాలి వారి ఇంట జరిగే పెళ్లిలో ఈ సీన్ కనిపించబోతోంది. అవును.. గాలి జనార్థన్ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. అసలే లక్షల కోట్లకు అధిపతి. ఆయన ఇంట పెళ్లంటే మాటలా? విందు, వినోదం, స్టార్లు, రాజకీయ నాయకులు, పేరు చెబితేనే హృదయం ఉప్పొంగే సెలబ్రెటీలూ అంతా క్యూ కట్టాల్సిందే. అయితే గాలి వారి జాతకం, ఆయన ట్రాక్ రికార్డు చూస్తే – ఆ పెళ్లికి వెళ్లిన వాళ్లందరినీ ఓ వంక అనుమానంగా చూడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అందుకే.. పెళ్లి శుభలేఖ అందినా ‘డుమ్మా’ కొట్టేయడానికే చూస్తారంతా. అక్కడే గాలి జనార్థనుడు నోట్లతో గాలం వేశాడు.. వాళ్లని పడేశాడు. పొలిటీషియన్లను పక్కన పెడితే సినిమా స్టార్లంతా `కాల్షీట్ల`ను అమ్ముకొనే బాపతే కదా? అందుకే ఆ మైనస్ పాయింట్‌ని బలంగా పట్టుకొని సినిమా వాళ్లని లక్షల్లో కొనేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులందరికీ గాలి వారి శుభలేఖలు అందాయి. ఆ శుభలేఖ ఓపెన్ చేయగానే అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. అందులో అన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకొక్క శుభలేఖకీ దాదాపుగా రూ.3 వేల వరకూ ఖర్చు చేశారని టాక్. శుభలేఖకే అంత ఖర్చు పెడితే.. ఇక పెళ్లి ఎలా చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాలా? భూగోళమంత పందిరి వేయడం ఖాయం. అవసరమైతే పక్క గోళాల్నీ కొని పడేస్తారు. గాలి జనార్థనుడి మహిమ మనకు తెలిసిందే కదా?
ఇంత పెళ్లి చేసినా అందులో స్టార్లు, వాళ్ల సరదాలూ లేకపోతే ఏం బావుంటుంది? అందుకే వాళ్లనీ రప్పిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా సిద్దమైపోయాయి. పెళ్లికి వచ్చి ఆశీర్వదించి వెళ్తే.. ఓ పారితోషికం. వచ్చాక ఓ పాటకు డాన్సో, మైకు పట్టుకొని నాలుగు జోకులో వేస్తే మరికొంత పారితోషికం.. ఇలా రెమ్యునరేషన్ల లిస్టు తయారు చేశారట. ఇందులో భాగంగానే ఓ హాస్య నటుడికి అక్షరాలా రూ.15 లక్షలు అర్పించారని సమాచారం. అందులోనూ… అవి ఫెళఫెలలాడే కొత్త రూ.2 వేల రూపాయల నోట్లని సమాచారం. టాలీవుడ్ నుంచి అరడజను హీరోయిన్లకు భారీ మొత్తంలో డబ్బులు గిట్టుబాటు అయ్యాయని, వాళ్లంతా పెళ్లికి వెళ్లి చిందులు వేయడం ఖాయమని తెలుస్తోంది. స్టార్ హీరోలకూ పిలుపులు వెళ్లినా.. వాళ్లంతా ఈ పెళ్లిని లైట్ తీసుకోవాలని చూస్తున్నార్ట. సినిమాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్లందరికీ ఇదో బంపర్ ఆఫరే! ఇలాంటి పెళ్లిళ్లు యేడాదికి రెండు మూడు తగిలితే సరిపోతుంది కదా??