తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త అంతర్గత భద్రతా ముఖచిత్రంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వెళ్లిన సీఎం, రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదికను అందజేశారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి స్వస్తి పలికి, దేశాన్ని, తెలంగాణను మావోయిస్టు రహిత ప్రాంతం గా ప్రకటించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.
గణపతి లొంగుబాటుకు రంగం సిద్ధం?
ఈ భేటీలో ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 80 ఏళ్ల గణపతి, ప్రధాన స్రవంతిలో కలవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయని, మార్చి 31వ తేదీలోపు ఆయన లొంగుబాటు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కుప్పకూలిన మావోయిస్ట్ అగ్ర నాయకత్వం
గత రెండేళ్లుగా సాగుతున్న ఉమ్మడి ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. 2025లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకత్వమే కరువైంది. ఇటీవల తిప్పిరి తిరుపతి , మల్ల రాజిరెడ్డి వంటి అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో పార్టీ కేడర్ లో నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. దండకారణ్యం నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న కార్యకర్తల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ గడ్డపై చారిత్రక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 గడువులోగా నక్సలిజం అంతం అనే లక్ష్యాన్ని చేరుకోవాలని ఉభయ ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇదే రోజున తెలంగాణ గడ్డపై నుంచి మావోయిస్టులు ఇక లేరు అనే చారిత్రక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లొంగిపోయే నాయకులకు భారీ పునరావాస ప్యాకేజీలు, సామాజిక భద్రత కల్పించే అంశంపై రేవంత్ రెడ్డి, అమిత్ షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నిజమైతే, దశాబ్దాల రక్తపాతానికి తెరపడి అడవిలో మళ్లీ ప్రశాంతత నెలకొంటుంది.


