భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేషుడ్నికి తుది పూజలు చేసి ఉదయమే నిమజ్జన ఊరేగింపు ప్రారంభించారు. టెలిఫోన్ భవన్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ గుండా 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం పూర్తవుతుంది. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని ఇతర చెరువులు, కృత్రిమ నిమజ్జన స్థలాల వద్ద గణపతి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది.
ప్రధాన శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమై, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్‌కు చేరుకుంటుంది. పోలీసులు భద్రతా సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పదిహేను వేల మందికిపైగా శానిటేషన్ సిబ్బంది, ముఫ్ఫై వేల మందికిపైగా పోలీసులు విధుల్లో ఉన్నారు.
లడ్డూ వేలం పాటలు ఈ సారి హుషారుగా సాగుతున్నాయి. ఎప్పుడూ అత్యధిక రేటుకు లడ్డూను సొంతం చేసుకునేది రిచ్ మండ్ విల్లాస్ సొసైటీ భక్తులే. ఈ సారి కూడా రెండు కోట్లకుపైగా పలికింది. మైహోంభూజా లడ్డూ 51 లక్షలు పలికింది. చాలా చోట్ల లక్షల్లోనే లడ్డూలను భక్తులు సొంతం చేసుకుంటున్నారు.