రివ్యూ: గ్యాంగ్ లీడ‌ర్‌

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

వీరుడికి ప్ర‌తీసారీ ఆయుధ‌మే అవ‌స‌రం ఉండ‌దు.
చిన్న క‌ర్ర‌పుల్ల తోడు దొరికినా – యుద్ధం చేసేస్తాడు.
కొంత‌మంది దర్శ‌కులు ఇదే బాప‌తు. చిన్న క‌థ దొరికితే చాలు – చెల‌రేగిపోతారు. అయితే విక్ర‌మ్ కె.కుమార్ ఎప్పుడూ బ‌ల‌మైన ఆయుధాల‌తో వస్తాడు. త‌న బ‌లం క‌థ‌. త‌న బ‌ల‌గం స్క్రీన్ ప్లే. ఇంత సాధార‌ణ‌మైన లైన్ తీసుకుని విక్ర‌మ్ సినిమా తీశాడేంటి? అని ఎప్పుడూ అనిపించ‌దు. త‌న ఫ్లాప్ సినిమా స్టోరీ లైన్లు కూడా బ‌లంగా ఉంటాయి.
అలాంటి విక్ర‌మ్ మ‌రోసారి వినూత్న‌మైన కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాడు.
ఓ రివైంజ్ స్టోరీ రైట‌ర్‌.
త‌న‌ని వెదుక్కుంటూ అయిదుగురు ఆడ‌వాళ్లు.
త‌మ రివైంజ్ లో స‌హాయం చేయ‌మ‌ని కోర‌డం
దాని వెనుక 300 కోట్ల బ్యాంకు రాబ‌రీ ఉండ‌డం

– సూప‌ర్బ్ ప్లాట్‌! ఇప్పుడొస్తున్న క‌థ‌ల‌కు భిన్నంగా సాగిన లైన్ ఇది. విక్ర‌మ్ త‌ల‌పెట్టిన స‌గం ప‌ని పూర్త‌య్యింది. మిగిలిన స‌గం – స్క్రీన్ పై చూపించ‌డ‌మే. మ‌రి ఆ స‌గం ఏమైంది? విక్ర‌మ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, నాని స్టార్ డ‌మ్‌, త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న – మిగిలిన స‌గం ప‌నిని పూర్తి చేశాయా?

ఇంట్ర‌డ‌క్ష‌న్లోనే కథేంటో అర్థ‌మైపోయి ఉంటుంది. అయినా స‌రే.. టూకీగా చెప్పుకుంటే –

ఆరుగురు క‌లిసి ఓ బ్యాంకు దొంగ‌త‌నం చేస్తారు. 300 కోట్లు కొట్టేస్తారు. అంద‌రూ స‌మానంగా పంచుకోవాల‌న్న‌ది ప్లాన్‌. కానీ.. ఆరోవాడు అయిదుగురిని చంపేసి ఆ డ‌బ్బుని కాజేస్తాడు. ఆ అయిదుగురి సంబంధించిన వ్య‌క్తులు… ఆ ఆరోవాడిపై ప‌గ తీర్చుకోవాల‌నుకుంటారు. అందుకోసం పెన్సిన్ పార్థ‌సార‌ధి (నాని) అనే ఓ రివైంజ్ డ్రామాలు రాసే రైట‌ర్ ని సంప్ర‌దిస్తారు. త‌నైతే ఇలాంటి మ‌ర్డ‌ర్ స్కెచ్‌ల‌కు మంచి స‌ల‌హా ఇస్తాడని. మ‌రి ఈ అయిదుగురు ఆడ‌వాళ్ల‌కు పెన్సిల్ పార్ధ‌సార‌ధి ఎలా గ్యాంగ్‌లీడ‌ర్‌గా మారాడు? ఆ ఆరోవాడు ఎవ‌డు? అనేది మిగిలిన క‌థ‌.

విక్ర‌మ్ మంచి లైనే ప‌ట్టాడు. క‌థ‌లో నావ‌ల్టీ ఉంది. విక్ర‌మ్ `మ‌నం`, `13బి`, `24`లాంటి కాంప్లికేటెడ్ స్క్రిప్ట్స్‌ని చాలా బాగా డీల్ చేశాడు. కాబ‌ట్టి – ఈ క‌థ‌ని త‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపిస్తాడ‌ని నాని న‌మ్మి ఉంటాడు. సినిమా మొద‌లైన ప‌ది, ఇర‌వై నిమిషాల వ‌ర‌కూ ప్రేక్ష‌కుడి ఫీలింగ్ కూడా అదే. బ్యాంక్ రాబ‌రీతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత అయిదుగురు ఆడ‌వాళ్లూ క‌లిసి పెన్సిల్ పార్ధ‌సార‌ధిని వెదుక్కుంటూ వ‌స్తారు. నాని రాక‌తో సీరియ‌స్ మూడ్‌లో సాగిపోతున్న క‌థ‌ని కొత్త క‌ల‌రింగు వ‌స్తుంది. నాని న‌ట‌న‌, త‌న కామెడీ టైమింగ్‌తో ఇంట్ర‌వెల్ ముందు కొన్ని స‌న్నివేశాల్ని సాఫీగా న‌డిచిపోయేలా చేశాడు.

అందులో సంతూర్ చింత‌పిక్క‌ల (వెన్నెల కిషోర్‌) ట్రాక్ ఒక‌టి. తొలి స‌గంలో – ప్రేక్ష‌కుడికి రిలీఫ్ ఇచ్చిన ఎపిసోడ్ ఇది. రివైంజ్ రైట‌ర్‌గా నాని ఇచ్చే బిల్డ‌ప్పులు – ల‌క్ష్మీ, శ‌ర‌ణ్య‌ల అమాయ‌క‌త్వం, చిన్న పిల్ల అల్ల‌రి – వీటితో క్యూట్ క్యూట్‌గా సాగిపోతుంది. `అదిరిపోయింది` అనే సీన్ ఉండ‌దు. `ఇదేంటి బోర్ కొట్టిస్తున్నాడు?` అని కూడా అనిపించ‌దు. ఇంట్ర‌వెట్ ట్విస్టు కూడా అదిరిపోయే రేంజులో ఉండ‌దు.

అయితే ద్వితీయార్థంలో మాత్రం మ‌లుపుల్ని ఆశిస్తాడుప్రేక్ష‌కుడు. కానీ.. అక్క‌డ విక్ర‌మ్ దొరికిపోయాడు. సెకండాఫ్‌లో ఒక‌ట్రెండు ట్విస్టులు పెట్టుకున్నా, అవేం పెద్ద‌గా ఆస‌క్తిని రేకెత్తించ‌వు. పైగా దేవ్ (కార్తికేయ‌) పాత్ర‌ని, అత‌ని కెపాసిటీని త‌నకిష్ట‌మొచ్చిన రీతిలో, త‌న క‌థ‌కు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్లి – టెంపో త‌గ్గించేశాడు.

`గ్యాంగ్ లీడ‌ర్‌` ఫ‌స్ట్ సీన్‌, షాట్‌ని ఓసాగి గుర్తు చేసుకుంటే… ఓ మార్చురీ వ్యాన్ వ‌చ్చి కుక్క‌ని గుద్దేసి వెళ్లిపోతుంది. ఆ కుక్క చ‌నిపోయి ర‌క్తం మ‌డుగులో క‌నిపిస్తుంది. ఈ షాట్‌ని ప్ర‌త్యేకంగా ఎందుకు గుర్తు చేయాల్సివ‌స్తోందంటే – ఈ షాట్ ని సైతం విక్ర‌మ్ త‌న క‌థ‌లో కీ పాయింట్‌గా మార్చుకుంటాడు.ఇంత చిన్న విష‌యంలోనూ శ్ర‌ద్ధ తీసుకుని సెభాష్ అనిపించుకున్న‌ విక్ర‌మ్ – సెకండాఫ్‌లో చాలా చోట్ల – లాజిక్ లేని సీన్లు పేర్చుకుంటూ ఎందుకు వెళ్లాడో అర్థం అవ్వ‌దు. కొన్నిసార్లు దేవ్ కూడా విక్ర‌మ్‌లా తెలివిగా ఆలోచిస్తుంటాడు. ఇంకొన్నిసార్లు తెలివి త‌క్కువ ఎత్తులు వేస్తుంటాడు. తొలి స‌న్నివేశాల్లో ఊర‌వ‌త‌ల‌, జ‌న సంచారం లేని ఓ 14 అంత‌స్థుల బిల్డింగ్ అని చూపించి – త‌న క‌థ‌కు కావాలి అనుకున్న‌ప్పుడు ఆ బిల్డింగ్ ముందు ఓ ఏటీమ్ సెంట‌ర్ నీ, గేటెడ్ క‌మ్యునిటీ అపార్ట్ మెంట్ నీ తీసుకొచ్చేస్తాడు. పెన్సిల్ పార్థ‌సార‌ధి – దేవ్ మ‌ద్య జ‌రిగే డ్రామా ఆస‌క్తిక‌రంగా ఉండి ఉంటే – త‌ప్ప‌కుండా గ్యాంగ్ లీడ‌ర్ ర‌క్తి క‌ట్టేది. విక్ర‌మ్ ఖాతాలో, నాని కెరీర్‌లో మ‌రో ప్ర‌త్యేక‌మైన చిత్రంగా మిగిలేది. ద్వితీయార్థంలో చేసిన త‌ప్పుల వ‌ల్ల‌.. ఆ అవ‌కాశం చేజారింది. ల‌క్ష్మీ పాత్ర ద‌గ్గ‌ర ఓ ట్విస్టు ఇచ్చి క‌థ‌ని ఎక్కడికో తీసుకెళ్తాడ‌నుకుంటే – ఆ సీన్‌ని కేవ‌లం సెంటిమెంట్ డ్రామా కోసం వాడుకోవ‌డం చూస్తే, క్లైమాక్స్‌లో ఏం చేయాలో తెలీక హీరో – విల‌న్ల మ‌ధ్య ఫైట్ పెట్టి – ఖేల్ ఖ‌తం అనిపిస్తే విక్ర‌మ్ కూడా ఇంత రొటీన్‌గా ఆలోచిస్తాడా అనిపిస్తుంది.

300 కోట్ల రాబ‌రీ జ‌రిగింది. ఆ నోటుల్లో ఒక్క సిరీస్ నెంబ‌ర్ మ్యాచ్ అయినా నిన్ను విడిచిపెట్ట‌ను అని నానికి వార్నింగ్ ఇస్తాడు ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. అప్ప‌టిని 150 కోట్లు ఖ‌ర్చయిపోతాయి కూడా. మ‌రి అప్పుడు సిరీస్ నెంబ‌ర్ల ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేస్తే.. దొంగ ముందే దొరికిపోయేవాడుగా?

ఈ గ్యాంగ్‌కి తెర‌పై లీడ‌ర్ అవ‌తారం ఎత్తిన నాని – ఎప్ప‌టిలా త‌న‌వైపు నుంచి త‌ప్పులేం లేకుండా, వీలైనంత వ‌ర‌కూ ఈ సినిమాని కాపాడే ప్ర‌య‌త్నం చేశాడు. నాని లుక్స్ మ‌రోసారి చాలా స‌హ‌జంగా ఉన్నాయి. న‌ట‌నలో ఎప్ప‌టిలా 100 శాతం విజృంభించాడు. త‌న కామెడీ టైమింగ్ ముఖ్యంగా తొలి స‌గంలో.. ఆక‌ట్టుకుంటుంది. కార్తికేయ ఈ సినిమాలో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హీరో కోసం, క‌థ కోసం త‌న బ‌లాల్ని చంపుకుంటూ వెళ్ల‌డంతో ఆ పాత్ర గుర్తుండిపోయేలా తెర‌పైకి రాలేక‌పోయింది. కార్తికేయ ఆకారం బాగున్నా – త‌న వాయిస్ మైన‌స్‌గా మారుతుంది. హీరోయిన్ చాలా అందంగా క‌నిపించింది. శ‌ర‌ణ్య‌, ల‌క్ష్మి త‌మ అనుభ‌వాన్ని రంగ‌రించారు. రెండే రెండు సీన్ల‌లోనే క‌నిపించినా వెన్నెల‌కిషోర్ న‌వ్విస్తాడు.

పాట‌ల‌కు అంత‌గా స్కోప్ లేదు. ఉన్న‌వ‌న్నీ క‌థ‌తో పాటు మిళితం అయిపోయాయి. ద‌ళంలోని ఓ పాట‌ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌గా వాడేసుకున్నాడు అనిరుధ్‌. ఈ విష‌యం నాని కూడా ఎలా ప‌ట్టుకోలేక‌పోయాడో అర్థం కాదు. విక్ర‌మ్ కె.కుమార్ మంచి లైనే తీసుకున్నాడు. కానీ ఈసారి త‌న స్క్రీన్ ప్లే మ్యాజిక్ ప‌ని చేయ‌లేదు. మేకింగ్ ప‌రంగా – మైత్రీ మూవీస్ ఎలాంటి లోటూ చేయ‌లేదు.

లాజిక్కులు వ‌దిలేసి విక్ర‌మ్ ఏ సినిమా తీయ‌లేదు. ఒక‌ట్రెండు సార్లు లాజిక్కులు ఫెయిల్ అయినా – విక్ర‌మ్ పాసైపోయేవాడు. ఇప్పుడు ఆ లాజిక్కుల్ని వ‌దిలేసి, కేవ‌లం నాని మ్యాజిక్‌పై ఆధార‌ప‌డ్డాడు. అదొక్క‌టే ఈ గ్యాంగ్ లీడ‌ర్‌కి శ్రీ‌రామ‌ర‌క్ష‌.

ఫినిషింగ్ ట‌చ్‌: ఊప్స్‌…

తెలుగు360 రేటింగ్‌: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com