గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న విషయాలు సామాన్యులకు విస్మయం కలిగిస్తున్నాయి. తెలంగాణలోపోలీస్, పొలిటికల్, ప్రెస్, అఫీషియల్ సర్కిల్స్ లోని వందలాది మందికి ఈ విషయాలన్నీ ముందే తెలిసే ఉంటుంది. నయీం కనుసన్నల్లో దందాలు చేసిన వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారని ఇప్పటి వరకూ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తూనే ఉంది.
నయీం ఒకే నెంబర్ తో రెండో సారి ఫోన్ చేయడం అరుదంటారు. తన అనుచరులకు కూడా ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడో వాళ్లకు తెలియదు. ఏ అనుచరుడు కూడా నయీంకు ఔట్ గోయింగ్ కాల్ చేసి ఉండడని టాక్. కాబట్టి వందల సిమ్ కార్డులు, హ్యాండ్ సెట్లు నయీం సమకూర్చుకున్నాడని సమాచారం.
నయీంతో పాటు అతడి అనుచరులు, కుటుంబ సభ్యుల దగ్గర దొరికిన సిమ్ కార్డులు 500కు పైనే ఉన్నాయట. అలాగే వందల కొద్దీ హ్యాండ్ సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఐ.ఎం.ఇ.ఐ. నెంబర్ల ఆధారంగా నయీం కదలికల గురించి ఆరా తీస్తున్నారు. అలాగే ఆ సిమ్ కార్డుల్లోని కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి ఫోన్ చేశాడో కూపీ లాగుతున్నారు. ఈ వివరాలు బయటకు వస్తే పెద్ద తలకాయలకు ఉచ్చు బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్, పొలిటికల్ సర్కిల్స్ లో నయీంతో అంటకాగి బాగా సంపాదించిన వారి బండారం సిమ్ కార్డుల ద్వారా బయటపడే అవకాశం ఉంది.
అయితే ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు గోప్యంగా ఉంచుతూ తమ పని తాము చేస్తున్నారు. తాము లీక్ చేయాలనుకున్న విషయాలపై మాత్రం మీడియాకు లీకులు ఇస్తున్నారు. ముఖ్యంగా బడా పోలీస్, పొలిటికల్ పేర్లు బయటకు వస్తాయా లేదా అనేదేచర్చనీయాంశమైంది. మరీ నిక్కచ్చిగా ఈ పేర్లను దర్యాప్తు అధికారులు బయటపెడతారా లేక గప్ చుప్ గా కేసు క్లోజ్ చేస్తారా అనే చర్చ నడుస్తోంది. దర్యాప్తు అధికారులపై అనుమానం కాదుగానీ, ఇప్పుడున్న వ్యవస్థలో బడాబాడుల పేర్లు బయటకు వస్తే మాత్రం అది సంచలనమే. చివరకు ఈ దర్యాప్తు ఎలా ముగుస్తుందో, ఎందరి బండారం బయటపడుతుందో చూద్దాం.