ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఉపాధ్యాయుల పనితీరు, ప్రస్తుత విద్యా వ్యవస్థలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన ఏం మాట్లాడరో చెప్పకుండా.. ఆయన ఏదో తప్పు మాట్లాడేశారన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా విమర్శించేస్తున్నారు. మంచి చెప్పే గురువులు అనే గౌరవం కూడా కొంత మంది ఇవ్వడం లేదు. ఆయనపై కొంత మందికి ఇంత కోపం ఎందుకో కానీ అసలేం మాట్లాడారో తెలియకుండా విమర్శిస్తున్న వారే ఎక్కువ.
బోధన కంటే లెక్కలకే ప్రాధాన్యమా?
గరికిపాటి నరసింహారావు సాధారణంగా సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే, ఇటీవల ఉపాధ్యాయుల విధులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. నిజానికి గరికిపాటి ఉద్దేశం ఉపాధ్యాయులను కించపరచడం కాదు, బోధన వదిలి వారు చేస్తున్న బోధనేతర పనుల వల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో ఎత్తిచూపడమే. ఒకప్పుడు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారని, కానీ నేడు వారు క్లర్కులుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిస్థితిని గమనిస్తే గరికిపాటి అన్న మాటల్లోని చేదు నిజం అర్థమవుతుంది. ప్రతిరోజూ ఉదయం బడికి వెళ్లగానే హాజరు కోసం యాప్‌లు ఓపెన్ చేయడం, మధ్యాహ్న భోజనంలో గుడ్ల లెక్కలు చూడటం, భోజనం నాణ్యతను రుచి చూసి లీప్ వంటి యాప్‌లలో ఫీడ్‌బ్యాక్ నమోదు చేయడం వంటివి వారి ప్రధాన విధిగా మారిపోయాయి. పాఠం చెప్పే సమయం కంటే యాప్‌లో డేటా ఎంట్రీ చేసే సమయమే ఎక్కువైపోతోంది అని స్వయంగా ఉపాధ్యాయులే వాపోతున్నారు. గరికిపాటి సరిగ్గా ఇదే పాయింట్‌ను ప్రస్తావించి, ఉపాధ్యాయుడి అసలు పని బోధన అని గుర్తు చేశారు.
వివాదం ఎందుకు చేస్తున్నారు?
రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యూయర్ షిప్ కోసం గరికిపాటి మాటలను సందర్భానుసారం కాకుండా, ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్రచారం చేయడం వల్ల ఈ వివాదం పుట్టుకొచ్చింది. ఆయన ఉపాధ్యాయులను విమర్శించారని కొందరు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఆయన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు పెంచడం వల్ల వారు ఒత్తిడికి లోనవుతున్నారని, అది నేరుగా విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఆయన విశ్లేషణ. దీనిని పాజిటివ్‌గా తీసుకోవాల్సింది పోయి, కొందరు కావాలని ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
అడ్డదారులు.. పరీక్షల గోల!
గరికిపాటి తన ప్రసంగాల్లో మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. విద్యా సంవత్సరం అంతా యాప్‌లు, లెక్కలతో గడిపేస్తున్న ఉపాధ్యాయులు, చివరికి పరీక్షల సమయం వచ్చేసరికి విద్యార్థులను పాస్ చేయించడానికి పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైనా ఫలితాలు బాగుండాలనే ఒత్తిడితో కొన్నిచోట్ల అడ్డదారులు తొక్కాల్సి రావడం వ్యవస్థకే అవమానకరం. ఉపాధ్యాయులను ఈ అడ్మినిస్ట్రేటివ్ పనుల నుండి విముక్తం చేసి, వారిని పూర్తిస్థాయిలో తరగతి గదికే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని గరికిపాటి మాటల సారాంశం.
మార్పు రావాల్సింది ఎక్కడ?
గరికిపాటి వ్యాఖ్యలను ఒక విమర్శగా కాకుండా, ఒక మేలుకొలుపుగా చూడాలి. టీచర్లు పెన్ పట్టుకోవాల్సిన సమయంలో ఫోన్ పట్టుకుని యాప్‌లు నొక్కడం వల్ల ప్రాథమిక విద్య కుంటుపడుతోంది. ప్రభుత్వం ఈ టెక్నాలజీ భారాన్ని తగ్గించి, ఉపాధ్యాయులు మళ్ళీ ఆచార్యులుగా తమ గౌరవాన్ని నిలబెట్టుకునేలా చూడాలి. గరికిపాటి చెప్పినట్లుగా.. గురువు పాఠం చెబితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది, వారు గుడ్ల లెక్కలు చూస్తే కాదు.
