ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్పు అంశంపై ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలోని ఇద్దరు ప్రముఖుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ పేరును తెలుగునాడు గా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన ప్రతిపాదన ఓ స్వామిజీకి నచ్చలేదు. ఇప్పటి వరకూ ఎవరూ విని ఉండని భువనేశ్వరి పీఠం అనే దానికి అధిపతి ప్రకటించుకున్న కమలానంద భారతి అనే ఆయన తెరపైకి వచ్చి గరికపాటిపై ఫైరయ్యారు.
ఏపీ పేరు మార్చాలనే ఆలోచన వింత పోకడ అని, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అని ఆయన గరికపాటిని నిలదీశారు. రామాయణ కాలం నుంచే ఆంధ్ర అనే పదానికి చారిత్రక ప్రాశస్త్యం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అడిగే వారు లేరని కొందరు మేధావులమని చెప్పుకునే వారు అధిక ప్రసంగాలు చేస్తున్నారని కమలానంద భారతి ..గరికపాటిపై మండిపడ్డారు.
రాష్ట్రం పేరు మార్చినంత మాత్రాన కొత్తగా వచ్చే సెంటిమెంట్ ఏమీ ఉండదని, గతంలో ఇటువంటి మేధావుల వల్లే ఆంధ్రులకు మద్రాస్ దక్కకుండా పోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గరికపాటి తెలంగాణలో సెటిల్ అయ్యారని మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు అంటూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీ సమస్యలతో సంబంధం లేని వారు పేరు మార్పుపై సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఈ వివాదంతో స్వామీజీకి ఉన్న సంబంధం ఏంటన్నది పక్కన పెడితే, ఆయన మాటల్లో గరికపాటిపై ఉన్న అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతకాలంగా ఏపీ పేరు మార్పుపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ ఇది అసలు పట్టించుకోకూడదని ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. అయినా పీఠానికి అధిపతిగా ప్రకటించుకున్న కమలానంద ఇంద ఆవేశపడటం ఎందుకో మరి?
