సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
ఎవరూ సృష్టించకపోతే కొత్త పదాలెలా పుడతాయ్! వెయ్ వీడికో వీరతాడు అంటాడు మాయాబజార్లో రమణారెడ్డి. అస్మదీయులకు అసమదీయులూ..తస్మదీయులకు తసమదీయులూ అని ఉచ్చరించిన సందర్భంలో డైలాగ్ ఇది. నవ్వుకోడానికి బాగానే ఉన్నా.. వాస్తవం ఆలోచిస్తే ఎంత కటువుగా ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి తిరుమల వెంకటేశ్వరునికి వచ్చింది. శభాష్ అని తిరుమల తిరుపతి దేవస్ధాన ఛైర్మన్ చదలవాడని ప్రశంసిస్తారో.. విమర్శిస్తారో మీ ఇష్టం. ఇంతకీ ఆయన్నెందుకంటున్నామనుకుంటున్నారా… వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి..
బ్రహ్మోత్సవాలలో నిర్వహించే గరుడ సేవను తిరుమల అవుటర్ రింగ్ రోడ్డుకు తరలిస్తామన్నారు చదలవాడ. మాడ వీధులలో నిర్వహించడం తలకు మించిన భారంగా తయారైందంటున్నారాయన. అక్కడితో ఆగకుండా ఆగమ శాస్త్రం ఏదైనా చెబుతుందనీ, బోర్డులో పెట్టి చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు తితిడి బోర్డు అధ్యక్షుడు. బ్రహ్మోత్సవాలలో విశిష్టమైన వాహన సేవ గరుడ సేవ. ఈ సేవ పూర్తయ్యే వరకూ అధికారులూ, పోలీసులూ టెన్షన్ పడిపోతారు. ఐదువేల మంది పోలీసులను ఇందుకు వినియోగిస్తారంటే ఆ సేవకున్న ప్రాధాన్యత తెలుస్తుంది. మాడవీధులు కిక్కిరిసిపోతాయి. ఇసుకేస్తే జనం రాలరు. నిర్వహణ కష్ట సాధ్యంగా ఉండడంతో దాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు తరలించడమేమిటో అర్థం కాదు. రింగ్ రోడ్డులో 24గంటల పాటు గరుడోత్సవాన్ని నిర్వహిస్తే.. ఇక తిరుమలకు భక్తుల్ని అనుమతించడం కూడా కష్టమవుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు తిరుమలలో చుక్కలు చూపిస్తాయి. ఎవరేమనుకున్నా స్వామివారి సేవలను మాడ వీధులలో నిర్వహించడమే సబబు. ఆయన చెప్పినట్టు నిబంధనలు మనం విధించుకున్నవే. కానీ ఆగమశాస్త్రం మనం రాసింది కాదు. ఎన్నో అంశాలను క్రోడీకరించుకుని రూపొందించిన శాస్త్రాన్ని ఆ అదేముందన్నట్లు మాట్లాడడం సబబు కాదేమో. ఇటువంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త ముందూ వెనుక ఆలోచించుకుంటే మంచిదేమో. స్వామికార్యం.. చాలా జాగ్రత్తగా చేయాల్సింది. బోర్డు పదవీ కాలం కూడా ముగింపునకు రాబోతోంది. చదలవాడ ఈ లోగానే ఏమైనా చేస్తారేమో చూడాలి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే. ఏమైనా బాలాజీకి సంబంధించిన వ్యవహారాలలో జోక్యం చేసుకునేటప్పుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించడం మేలు.