నందమూరి బాలకృష్ణ 100 చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ భారీ ఎత్తున చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 16న తిరుపతితో శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుంది. బాలయ్య 100వ చిత్రం కాబట్టి… హీరోగా ఆయన కెరీర్లో ఇదో మైలురాయి కాబట్టి, తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో ఈ వేడుక అట్టహాసంగా ఉంటుందని అనుకుంటాం! కానీ, ఈ ఆడియో విడుదల వేడుక… మరో కలర్లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ఫంక్షన్‌కు పొలిటికల్ కళ ఇప్పటికే వచ్చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సినిమా ఫంక్షన్లకు రాజకీయ నాయకులు రావడం అనేది కొత్త విషయమేం కాదు. ఆ మాట కొస్తే… మొన్నటికి మొన్న జరిగిన ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వచ్చారు. అయితే, సినీ వేడుకలకు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా… ఫిల్మీ వాతావరణమే డామినేట్‌గా ఉంటుంది. కానీ, శాతకర్ణి ఆడియో ఫంక్షన్ మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమంగా మారబోతున్నట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే, నటుడు బాలకృష్ణ ఎలాగూ ఎమ్మెల్యే. మరోపక్క వియ్యంకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమానికి రావడం దాదాపు ఖరారైందనే చెబుతున్నారు. ఈ ప్రముఖులిద్దరూ వచ్చాక… వారి వెంటన తరలివచ్చే ఇతర నేతాగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక, ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుపతిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలూ కటౌట్లూ ఎలాగూ పెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్య కటౌట్లను భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే పనిలో పెద్ద సంఖ్యలో దేశం కార్యకర్తలో నిమగ్నమై ఉన్నారట. ఇక, ఈ వేడుకలకు సంబంధించిన పనుల్ని టీడీపీ పెద్దలే దగ్గరుండి ప్లాన్ చేస్తున్నారట! మొత్తానికి శాతకర్ణి ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మిస్ అవుతున్న చిన్న లాజిక్ ఏంటంటే… ఇతర పార్టీల్లో ఉన్న బాలయ్య అభిమానులు ఈ శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను ఎలా అర్థం చేసుకోవాలి..? సినిమా ఫంక్షన్‌కు ఇలా రాజకీయ రంగు పులిమేయడం అనేది బాలయ్య అభిమానులందరూ హర్షిస్తారా..? ఓవరాల్‌గా ఇది తెలుగుదేశం సర్కారు స్పాన్సర్డ్ ఆడియో విడుదల కార్యక్రమంగా మారిపోతున్నట్టుగా ఉంది.