నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. దాదాపు రూ.55 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్ల బిజినెస్ చేసి – వారెవా అనిపించింది. ఇక బాక్సాఫీసు దగ్గర బాలయ్య ఎన్ని సంచలనాలు చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య చిత్రం కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకొంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్‌ని మినహాయిస్తే.. మేజర్ షూటింగ్ అంతా అయిపోయినట్టే. ఈరోజు రామోజీ ఫిల్మ్‌సిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రియలపై ఓ గీతాన్ని తెరకెక్కించారు. దాంతో షూటింగ్ పూర్తయిపోయింది. గ్రాఫిక్స్ పార్ట్ మాత్రమే బాకీ పడింది. దాదాపు ప్రతీ సన్నివేశం సీజీ వర్క్ తో ముడిపడి ఉన్నదే. రఫ్ ఎడిటింగ్ పూర్తయిపోయింది. తీసిన సీన్ తీసినట్టుగానే సీజీకి పంపించేయడంతో.. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ కూడా సమాంతరంగానే జరుగుతోంది. దాదాపు 25 కంపెనీలు ఈ సినిమాకి గ్రాఫిక్స్ హంగులు అద్దడంలో తలమునకలైపోయి ఉన్నాయి. ఈ నెలాఖరుకల్లా గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తయిపోయతాయి. డిసెంబరు లోనే థియేటరికల్ ట్రైలర్‌ని, పాటల్ని విడుదల చేస్తారు. ఆడియో ఆవిష్కరణ తిరుపతిలో జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అంతగా అవసరమైతే.. మరో రోజు ముందుగానే గౌతమి పుత్రని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే `గుమ్మడికాయ్` ఫంక్షన్ ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తోంది. అయితే గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయిన తరవాత ఒకేసారి గుమ్మడికాయ్ కొట్టేద్దామని బాలయ్య సూచించారట. ఈ సినిమాని అనుకొన్న సమయంకంటే ముందే సిద్దం చేసి ఉంచుకోవాలని, ఆఖరి నిమిషాల్లో హడావుడి కూడదన్నది బాలయ్య ఆలోచన. దానికి తగ్గట్టుగానే చిత్రబృందం బాగా స్పందించి, అనుకొన్న సమయాని కంటే ముందే.. ఈ సినిమా సిద్దం చేసింది.