నాగచైతన్యకు తెలుగుతో తొలి హిట్ అందించి లవర్ బోయ్‌గా నిలబెట్టాడు గౌతమ్ మీనన్. జోష్ సినిమాతో డీలా పడ్డ చైతూకి గౌతమ్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా సో… సో… గా ఆడుతోంది. అయితే…. మళ్లీ చైతూతో ఓ సినిమా చేయడానికి గౌతమ్ మీనన్ తహతహలాడుతున్నాడు. అయితే ఈసారి చైతూతో స్ట్రయిట్‌గా ఓ తమిళ సినిమా తీస్తాడట. ”చైతూకి తమిళం బాగా వచ్చు. తనకు తమిళంలో ఇంట్రడ్యూస్ అవ్వాలని ఉంది. భవిష్యత్తులో చైతూతో ఓ తమిళ సినిమా చేస్తా” అంటున్నాడు గౌతమ్ మీనన్. చైతూ కూడా ఇదే మాట చెబుతున్నాడు. ”సాహసం శ్వాసగా తమిళంలో కూడా నేనే చేయాల్సింది. అయితే గౌతమ్ మీనన్ అప్పటికే శింబుకి మాట ఇచ్చేశారు. ఈసారి గౌతమ్ సార్‌తో చేస్తే తమిళ సినిమానే చేస్తా” అంటున్నాడు చైతూ.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఓ సినిమా తెరకెక్కించడానికి గౌతమ్ సన్నాహాలు చేసుకొంటున్నాడు. సాహసం శ్వాసగా.. తరవాత గౌతమ్ నుంచి రూపుదిద్దుకొనే చిత్రమిదే. కథ సిద్దమైంది. ప్రస్తుతం కథానాయకుల వేట సాగుతుంది. తెలుగు నుంచి హీరోగా ఎవరిని ఎంచుకొంటారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు సూర్యకి కూడా ఓ కథ చెప్పాడు గౌతమ్ మీనన్. 2017లో సూర్యతో సినిమా పట్టాలెక్కబోతోందంటున్నాడు గౌతమ్. మహేష్ బాబు, రామ్‌చరణ్‌ల కోసం గౌతమ్ మీనన్ కథలు సిద్దం చేసుకొన్నా, అవి కార్యరూపం దాల్చలేదు. సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా అనుకొన్నా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గౌతమ్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. అవి పూర్తయ్యేటప్పటికి రెండేళ్లు పడుతుంది. అంటే.. ఈలోగా తెలుగు హీరోలతో గౌతమ్ సినిమాలు చేయకపోవొచ్చు.