‘గీత గోవిందం’.. చాలామంది కెరీర్లకు ఉపయోగపడిన సినిమా. గీతా ఆర్ట్స్‌కి భారీ విజయాన్ని అందించిన సినిమా. విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య అనుబంధం చిగురింపజేసిన సినిమా. పరశురామ్ పై పెద్ద హీరోల దృష్టి పడేలా చేసిన సినిమా. తక్కువ బడ్జెట్ తో తీసినా వంద కోట్లు కొట్టిన సినిమా. అన్ని రకాలుగా ఈ సినిమా ప్రత్యేకమే. అందుకే గీతా ఆర్ట్స్ … విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బన్నీవాస్ స్వయంగా వెల్లడించారు.
‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సినిమా నిర్మాణంలో బన్నీ వాస్ భాగం పంచుకొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అల్లు అరవింద్ కూడా వచ్చారు. ఆయన సమక్షంలోనే గీతా ఆర్ట్స్ లో విజయ్ తో మరో సినిమా ఉంటుందని బన్నీ వాస్ డిక్లేర్ చేసేశారు. గీత గోవిందంలా చెప్పుకొనే సినిమా అవ్వాలని, మళ్లీ అలాంటి సినిమా టచ్ చేయాలంటే కొన్నేళ్లు పట్టేలా, ఈసారి బలంగా హిట్టు కొట్టాలని, ఆ ప్రయత్నాల్లోనే గీతా ఆర్ట్స్ ఉందని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. బన్నీ వాస్ అన్నారంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి.. ఈ కాంబో త్వరలోనే చూడొచ్చు.
గత కొంతకాలంగా విజయ్ కోసం గీతా ఆర్ట్స్ కథలు వింటోంది. కథ సెట్ అయితే చాలు.. ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లిపోతుంది. నిజానికి ‘గీత గోవిందం’ కాంబోనే మళ్లీ సెట్ చేద్దామనుకొన్నారు. పరశురామ్ – విజయ్‌లతో సినిమా తీద్దామనుకొంది గీతా ఆర్ట్స్. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ రూపంలో ఆల్రెడీ ఈ కాంబో లో ఓ ఫ్లాప్ పడిపోయింది. అందుకే.. పరశురామ్ ని పక్కన పెట్టి, మరో కొత్త కథ, మరో కొత్త దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు.